12 hour fast: చక్కని ఆరోగ్యానికి జెరోదా నితిన్ కామత్ పాటిస్తున్న సూత్రాలు

  • రాత్రి నిద్రకు 2 గంటల ముందే డిన్నర్ పూర్తి
  • అన్ని రకాల గ్యాడ్జెట్లకు సెలవు
  • కనీసం 12 గంటల పాటు ఫాస్టింగ్
  • యాపిల్ వాచ్ లో రోజువారీ పనుల ట్రాకింగ్
12 hour fast meditation in Zerodha Nithin Kamath healthier lifestyle changes

ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే కొద్ది మంది వ్యాపారవేత్తల్లో జెరోదా నితిన్ కామత్ కూడా ఒకరు. ఆరోగ్యకరమైన జీవనం దిశగా ఆయన జెరోదా ఉద్యోగులను తరచుగా ప్రోత్సహిస్తుంటారు. స్వయంగా నితిన్ కామత్ కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఫిట్ నెస్ ట్రాకర్ల సాయంతో రోజువారీ కేలరీలను బర్న్ చేసుకునే వారికి ఇటీవలే బహుమతులను ప్రకటించారు. లక్ష్యాలను చేరుకుంటే ఒక నెల జీతం బోనస్ గా ఇస్తామని చెప్పారు. హెల్త్, ఫిట్ నెస్ చాలెంజ్ పేరుతో నితిన్ కామత్ దీనికి శ్రీకారం చుట్టారు.

తాజాగా ట్విట్టర్లో శివసింగ్ సంగ్వాన్ అనే యూజర్ నితిన్ కామత్ ను ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. ‘‘మీ రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టిన రెండు లేదా మూడు మార్పులను, ప్రాథమికంగా మిమ్మల్ని ఆరోగ్యంగా మార్చేవాటిని సూచించండి. ఇతరులు సైతం వీటిని స్ఫూర్తిగా తీసుకుంటారని నమ్మకంగా చెప్పగలను’’అని సంగ్వాన్ ట్వీట్ చేశాడు. దీనికి నితిన్ కామత్ అందరూ ఆచరించతగినవి సూచించారు. 

  • ‘‘ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి కనీసం రెండు గంటల ముందుగానే డిన్నర్ ముగించడం, గ్యాడ్జెట్లను పక్కన పెట్టేయడం. 
  • నిద్రకు ముందు 10 నిమిషాల పాటు యోగనిద్ర లేదా ప్రాణాయామం చేయడం.
  • కనీసం 12 గంటల పాటు ఆహారం తీసుకోకుండా (ఫాస్టింగ్ ) ఉండడం (రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు). 
  • యాపిల్ వాచ్ లో రోజువారీ ఏం చేయాలన్నది నిర్దేశించుకోవడం.
  • డ్రింక్ కు ముందే ప్రొటీన్ తీసుకోవడం.’’ అని నితిన్ కామత్ సూచించారు. 35 ఏళ్ల తర్వాత ఆరోగ్యం పరంగా చూపించే శ్రద్ధ 60ఏళ్ల తర్వాత ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఆయన చెప్పడం గమనార్హం.

More Telugu News