Maharashtra: నాసిక్‌లో విషాదం: బస్సుకు మంటలు అంటుకుని 12 మంది సజీవ దహనం

12 feared dead as bus catches fire after crash in Maharashtras Nashik
  • నాసిక్-ఔరంగాబాద్ హైవేపై ప్రమాదం
  • ట్రక్కును ఢీకొట్టిన లగ్జరీ బస్సు
  • ఆ వెంటనే చెలరేగిన మంటలు
  • తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పీఎం మోదీ, సీఎం ఏక్‌నాథ్ షిండే
  • బాధితుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

మహారాష్ట్రలోని ప్రముఖ దర్శనీయ స్థలమైన నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ లగ్జరీ బస్సు నాసిక్-ఔరంగాబాద్ జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున 5.15 గంటలకు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు ముందువెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఆ వెంటనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఎగసిపడిన మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 12 మంది మంటలకు ఆహుతి కాగా, మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రమాదం తన ఇంటి సమీపంలోనే జరిగిందని, ఈ ఘటనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపాడు. ఆ వెంటనే బస్సులో మంటలు అంటుకుని అందులోని ప్రయాణికులు మరణించారని పేర్కొన్నారు. ప్రమాదాన్ని తాము ప్రత్యక్షంగా చూసినప్పటికీ ఏమీ చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత సమాచారం అందుకుని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్టు చెప్పాడు.  

ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు అయ్యే చికిత్స ఖర్చులు భరిస్తామని మంత్రి దాడా భుసే పేర్కొన్నారు. అలాగే, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ కింద రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News