Prithvi Shaw: పరుగులు చేస్తున్నా అవకాశాలు రావడం లేదు: పృథ్వీ షా ఆవేదన

  • దులీప్ ట్రోఫీలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు
  • న్యూజిలాండ్-ఎ జట్టు పైనా పరుగులు
  • చాలా అసంతృప్తిగా ఉందన్న పృథ్వీ షా
  • జాతీయ జట్టులోకి వస్తానని ధీమా
I am scoring runs but not getting a chance says Prithvi Shaw

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడుతున్న భారత జట్టులో తనకు చోటు లభించకపోవడంపై టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా మరోమారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పరుగులు చేస్తున్నప్పటికీ తనకు జట్టులో చోటు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో షా ఇటీవల అదరగొడుతున్నాడు. అర్ధ సెంచరీలు, సెంచరీలతో విరుచుకుపడుతున్నాడు. అయినప్పటికీ బీసీసీఐ అతడివైపు చూడడం లేదు. 

సెప్టెంబరులో న్యూజిలాండ్-ఎ జట్టుతో తలపడిన భారత-ఎ జట్టులో పృథ్వీ షా సభ్యుడైనప్పటికీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తుండగా పలువురు యువ క్రికెటర్లకు జట్టులో చోటు లభించింది. అయితే, షాకు మాత్రం చోటు కరువైంది. మరోవైపు, టీ20 ప్రపంచకప్ కోసం టీ20 స్పెషలిస్టులతో కూడిన భారత సీనియర్ జట్టు ఆస్ట్రేలియాకు చేరుకుంది.

గత నెలలో జరిగిన దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్‌కు ఆడిన పృథ్వీ షా రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్-ఎ జట్టుపై 44 బంతుల్లో 77 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు షా ఎంపిక ఖాయమన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, అతడికి నిరాశే ఎదురైంది. టీమిండియాలో చోటు కోసం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి ఎదురైంది.

ఈ నేపథ్యంలో షా మాట్లాడుతూ.. ‘‘నేను చాలా అసంతృప్తికి గురయ్యాను’’ అని వ్యాఖ్యానించాడు. తాను చాలా కష్టపడుతున్నానని, పరుగులు సాధిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ తనకు అవకాశం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఇబ్బంది లేదని... తాను ఓకే అని వారు (సెలక్టర్లు) భావించినప్పుడు, తనను పిలుస్తారని షా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇండియా-ఎ జట్టు, ఇతర జట్లలో మాత్రమే తనకు అవకాశాలు దక్కుతున్నాయన్న పృథ్వీ షా.. తాను ఫామ్‌లో ఉన్నానని, జాతీయ జట్టులోకి వచ్చి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

More Telugu News