Roger Binny: బీసీసీఐ తదుపరి బాస్‌గా రోజర్ బిన్నీ!

  • ముగియనున్న గంగూలీ పదవీ కాలం
  • ఈ నెల 18న ఎన్నికలు 
  • అదే రోజు సాయంత్రం ఫలితాల వెల్లడి
  • గతంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన బిన్నీ
Roger Binny Likely To Replace Sourav Ganguly As BCCI President

భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త బాస్ ఎవరొస్తారన్న ఊహాగానాలకు దాదాపు తెరపడింది. టీమిండియా మాజీ క్రికెటర్, 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోని సభ్యుడైన పేసర్ రోజర్ బిన్నీ పేరు తెరపైకి వచ్చింది. బిన్నీ గతంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగానూ పనిచేశాడు. ఇప్పుడీ మాజీ పేసర్ గంగూలీ స్థానాన్ని భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా మాత్రం అదే పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది. 

ఈ నెల 18న జరగనున్న బీసీసీఐ ఎన్నికలు, వార్షిక సర్వసభ్య సమావేశానికి సంబంధించిన వివరాలను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఎస్) కార్యదర్శి సంతోష్ మేనన్‌కు బదులుగా బిన్నీ పేరు కనిపించింది. బీసీసీఐ అధ్యక్ష రేసులో బిన్నీ ఉన్నాడన్న వార్తలకు ఇది బలం చేకూరుస్తోంది. బిన్నీ ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీకే) చీఫ్‌గా ఉన్నాడు. 

బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలకు ఈ నెల 11, 12 తేదీల్లో నామినేషన్ స్వీకరిస్తారు. 13న వాటిని పరిశీలిస్తారు. 14న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 18న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం బీసీసీఐ బాస్ ఎవరన్నది వెల్లడిస్తారు.

More Telugu News