Telangana: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కంపెనీకి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు... క్విడ్ ప్రొకోనేన‌ని కేటీఆర్ ట్వీట్‌

  • టీవీ డీబేట్‌లో కాంట్రాక్టును ప్ర‌స్తావించిన రాజ‌గోపాల్ రెడ్డి
  • ఆ వీడియోను జ‌త చేస్తూ ట్వీట్ పోస్ట్ చేసిన కేటీఆర్‌
  • కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కూడా రాజ‌గోపాల్ రెడ్డి బాట‌లో న‌డ‌వాలంటూ చుర‌క‌
ktr alleges komatireddy rajagopal reddy confessed of Quid pro Quo

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. కోమ‌టిరెడ్డి క్విడ్ ప్రొకోకు పాల్ప‌డ్డారంటూ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా కేటీఆర్ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్న సంద‌ర్భంగా 6 నెల‌ల క్రితం త‌న కంపెనీకి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు ద‌క్కింద‌ని కోమటిరెడ్డి స్వ‌యంగా వెల్ల‌డించారు. ఓపెన్ బిడ్డింగ్‌లో పాల్గొన్న త‌న కంపెనీ ఈ కాంట్రాక్టును సాధించింద‌ని ఆయ‌న చెప్పారు. ఈ వీడియోను టీఆర్ఎస్ నేత‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు.

ఇదే వీడియోను త‌న ట్వీట్‌కు జ‌త చేసిన కేటీఆర్‌... రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు ద‌క్కినందుకే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలో చేరార‌ని తెలిపారు. ఇది క్విడ్ ప్రొకో కాక మ‌రేమిట‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇక రాజ‌గోపాల్ రెడ్డి బాట‌లోనే ఆయ‌న సోద‌రుడు, కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సాగితే మంచిదంటూ కేటీఆర్ చుర‌క అంటించారు.

More Telugu News