Whatsapp: 10 లక్షల వాట్సాప్ ఖాతాల డేటా చోరీ... చైనా కంపెనీలపై దావా వేసిన మెటా

  • ఆన్ లైన్ లో వాట్సాప్ కు నకిలీలు
  • వాటి ప్రధాన కార్యాలయాలు చైనాలో!
  • అమెరికా కోర్టులో దావా వేసిన మెటా
Whatsapp parental company sues over Chinese apps

ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ మాతృసంస్థ 'మెటా' పలు చైనా కంపెనీలపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించింది. పది లక్షల వాట్సాప్ ఖాతాల వివరాలను సదరు చైనా సంస్థలు తస్కరించాయంటూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేసింది. 

హేయ్ మోడ్స్, హైలైట్ మోబి, హేయ్ వాట్సాప్ పేరిట ఈ సంస్థలు అనధికార వాట్సాప్ లు గా చెలామణీ అవుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. వీటి ప్రధాన కార్యాలయాలు చైనాలో ఉన్నట్టు తెలిసింది. ఈ నకిలీ యాప్ లపై వాట్సాప్ గత కొంతకాలంగా యూజర్లకు హెచ్చరికలు చేస్తోంది. 

ఈ నకిలీ వాట్సాప్ వేదికలు అధికారిక యాప్ లలో లేని అదనపు ఫీచర్లను సైతం అందిస్తూ యూజర్లకు గాలం వేస్తుంటాయి. ఇవి థర్డ్ పార్టీ ఏపీకే సైట్లలోనూ, గూగుల్ ప్లే స్టోర్ లోనూ అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. ఈ నకిలీ యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే మాల్వేర్లను ఆహ్వానించినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

'హేయ్ మోడ్స్' పై వాట్సాప్ హెడ్ విల్ కాథ్ కార్ట్ రెండు నెలల క్రితమే స్పందించారు. ఈ యాప్ ద్వారా మరింత నష్టం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. గూగుల్ ప్లే ప్రొటెక్ట్, ఆండ్రాయిడ్ ల సాయంతో ఈ నకిలీ యాప్ ల తొలగింపునకు కృషి చేస్తామని తెలిపారు.

More Telugu News