Telangana: మునుగోడులో తొలి రోజే రెండు నామినేష‌న్లు దాఖ‌లు

2 nominations filed for minigode bypoll on first day
  • మునుగోడు ఉప‌ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను జారీ చేసిన ఈసీ
  • ప్రజా ఏక్తా పార్టీ త‌ర‌ఫున నామినేషన్ వేసిన నాగ‌రాజు
  • స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మారం వెంక‌ట్ రెడ్డి
తెలంగాణ‌లో ఆస‌క్తి రేకెత్తిస్తోన్న న‌ల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం శుక్ర‌వారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ కావ‌డంతో శుక్ర‌వారం నుంచే నామినేష‌న్ల దాఖ‌లు కూడా ప్రారంభ‌మైపోయింది. తొలి రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ముగియ‌గా... రెండు నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. వీటిలో ప్ర‌జా ఏక్తా పార్టీ నుంచి నాగరాజు దాఖ‌లు చేసిన నామినేష‌న్ ఒక‌టి కాగా... రెండో దానిని స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా మారం వెంక‌ట్ రెడ్డి దాఖ‌లు చేశారు.

శుక్ర‌వారం మొద‌లైన నామినేష‌న్ల దాఖ‌లుకు ఈ నెల 14తో గ‌డువు ముగియ‌నుంది. అయితే నామినేష‌న్ల దాఖ‌లు ప్రారంభ‌మైన శుక్ర‌వారం త‌ర్వాత 2 రోజుల పాటు నామినేష‌న్ల దాఖ‌లేమి ఉండ‌దు. ఎందుకంటే..  సెల‌వు దినాలు రెండో శ‌నివారంతో రేపు, ఆదివారంతో ఎల్లుండి నామినేష‌న్ల దాఖ‌లుకు వీలు ప‌డ‌దు. ఇక సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు మాత్ర‌మే నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ఉంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌డంతో మునుగోడుకు ఉప ఎన్నిక జ‌రుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక‌లో కోమ‌టిరెడ్డి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్నారు.
Telangana
Munugode
Munugode Bypoll
Congress
BJP
Komatireddy Raj Gopal Reddy
Election Commission

More Telugu News