Nobel Peace Prize: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఎవరికి దక్కిందంటే...!

  • 2022 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటన
  • ఓ ఉద్యమకారుడితో పాటు రెండు సంస్థలకు శాంతి బహుమతి
  • అధికారిక ప్రకటన చేసిన నార్వేజియన్ నోబెల్ కమిటీ
Nobel Peace Prize announced

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడే వ్యక్తులు, సంస్థలకు ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని అందజేస్తారు. ఈ ఏడాది కూడా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. 

బెలారస్ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బైలియాట్ స్కీ, రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ 'మెమోరియల్', ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థ 'సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్' లను 2022 సంవత్సరానికి గాను నోబెల్ పీస్ ప్రైజ్ కు ఎంపిక చేశారు. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. 

తమ దేశాల్లో ప్రజలకు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు పట్ల అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి ఇస్తామని ఈ సందర్భంగా కమిటీ వివరించింది. 

ఈ ఏడాది శాంతి బహుమతి విజేతలు యుద్ధ నేరాలను నమోదు చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడం ద్వారా అమోఘమైన కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పడంలో పౌర సమాజం పాత్ర ప్రాముఖ్యతను వారు చాటి చెప్పారని వివరించింది.

More Telugu News