t20: టీ20 మ్యాచ్‌లో డ‌బుల్ సెంచ‌రీ

  • విండీస్‌ క్రికెటర్‌ రకీమ్‌ కార్న్‌వాల్ రికార్డు
  • 77 బంతుల్లోనే అజేయంగా 205 ప‌రుగులు
  • అట్లాంటా ఓపెన్ టీ20 లీగ్‌లో ఘ‌న‌త‌
West Indies all rounder Rahkeem Cornwall scores DOUBLE HUNDRED in T20 match

టీ20 ఫార్మాట్‌లో సెంచరీ రావడమే అరుదు. జట్టు స్కోరు 200 దాడటం కూడా అంత సుల‌భం ఏమీ కాదు. కానీ, వెస్టిండీస్‌ భారీకాయుడు రకీమ్‌ కార్న్‌వాల్‌ ఒక్కడే డబుల్‌ సెంచరీ కొట్టేశాడు. అట్లాంటా ఓపెన్ అనే మైన‌ర్ టీ20 లీగ్ లో అత‌ను ఈ ఘ‌న‌త సాధించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 77 బంతుల్లోనే అజేయంగా 205 ప‌రుగులు రాబ‌ట్టాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 సిక్సర్లు, 17 ఫోర్లున్నాయి. స్ట్రయిక్‌ రేట్‌ 266 కావ‌డం గ‌మ‌నార్హం. ఈ దెబ్బతో టీ20 ఫార్మాట్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా కార్న్‌వాల్‌ రికార్డు సృష్టించాడు. అంతేకాదు తన జట్టుకు 326/1 స్కోరు అందించాడు. టీ20ల్లో ఓ జట్టుకు ఇదే అత్య‌ధిక స్కోరు.

కార్న్‌వాల్‌ రికార్డు బ్యాటింగ్‌తో అత‌ను ప్రాతినిధ్యం వ‌హించిన అట్లాంటా ఫైర్స్‌ 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 326 ప‌రుగులు చేసింది. భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌కు దిగిన  ప్ర‌త్య‌ర్థి స్క్వేర్‌ డ్రైవ్ జ‌ట్టు ఓవర్లన్నీ ఆడి 154/8 స్కోరు మాత్రమే చేసింది. దాంతో, అట్లాంటా ఫైర్స్ 172 ప‌రుగుల‌ తేడాతో విజ‌యం సాధించింది. అధికారిక టీ20 ఫార్మాట్ లో ఇప్ప‌టిదాకా ఎవ్వ‌రూ ద్వి శ‌త‌కం సాధించ‌లేదు. 2013 ఐపీఎల్‌లో వెస్టిండీస్ డ్యాషింగ్ క్రికెట‌ర్ క్రిస్ గేల్ ఆర్ సీబీ త‌ర‌ఫున పుణె వారియ‌ర్స్ చేసిన 175 ప‌రుగులే ఇప్ప‌టిదాకా అత్యుత్త‌మం. కార్న్‌వాల్ ఇప్పుడు డ‌బుల్ సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికీ దాన్ని రికార్డుగా ప‌రిగ‌ణిస్తారో లేదో తెలియ‌దు. ఎందుకంటే త‌ను ఈ ఘ‌న‌త సాధించింది మైనర్‌ క్రికెట్‌ లీగ్‌లో. ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీ ప్రైజ్‌మనీ 75 వేల డాలర్లు మాత్రమే. జట్ల సామర్థ్యం, మ్యాచ్‌లు జరిగే మైదానాలు కూడా అంతర్జాతీయ స్థాయివి కాదు. బౌండ్రీ లైన్స్ కూడా చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి.

More Telugu News