Atchannaidu: ఐప్యాక్, బ్లూ మీడియా ట్రాప్ లో పడొద్దు... హీరోలు, వారి అభిమానుల వివాదాల్లో టీడీపీ కార్యకర్తలు తలదూర్చొద్దు: అచ్చెన్నాయుడు

  • సోషల్ మీడియాలో స్పందించిన అచ్చెన్నాయుడు
  • టీడీపీలో అన్ని రంగాల వారు ఉన్నారని వెల్లడి
  • వారిని కించపరిచేలా వ్యవహరించొద్దని హితవు
  • వైసీపీ ప్రభుత్వంపైనే మన పోరాటం అంటూ పిలుపు
Atchannaidu calls TDP Workers do not get into traps

ఐప్యాక్, బ్లూ మీడియా వలలో చిక్కుకోవద్దని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 

టీడీపీ అందరిదీ అని స్పష్టం చేశారు. మన పార్టీలో అన్ని మతాల వారు, కులాల వారు, ప్రాంతాల వారు, వేర్వేరు రంగాలకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు, నటుల అభిమానులు కూడా ఉంటారని వెల్లడించారు. ఒక పార్టీగా మన పోరాటం ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ అరాచకాలపై అని అచ్చెన్నాయుడు వివరించారు. మన పోరాటం వైసీపీ ప్రభుత్వంతోనే అని ఉద్ఘాటించారు. 

మన దృష్టంతా ఆ లక్ష్యంపైనే ఉండాలి తప్ప, హీరోల గురించి, వారి అభిమానుల గురించి వెటకారం, ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడడం కానీ, పోస్టులు చేయడం కానీ చేయవద్దని పార్టీ శ్రేణులకు హితవు పలికారు. హీరోలు, వారి అభిమానుల వివాదాల్లోకి తలదూర్చవద్దని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తద్వారా ప్రత్యర్థి పక్షానికి లాభం చేకూర్చకుండా సుశిక్షితులైన సైనికుల్లా పోరాడదామని పిలుపునిచ్చారు. 

ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఉమ్మడి లక్ష్యం కోసం కలసికట్టుగా పోరాడదామని తెలిపారు. పార్టీలోని అందరి అభిప్రాయాలను గౌరవిద్దామని పేర్కొన్నారు.

More Telugu News