ఒక పెద్ద హిట్ వచ్చిన తర్వాత 'అలయ్ బలయ్' కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉంది: చిరంజీవి

06-10-2022 Thu 19:53
  • నాంపల్లిలో అలయ్ బలయ్
  • కార్యక్రమం నిర్వహించిన బండారు దత్తాత్రేయ
  • హాజరైన చిరంజీవి
  • తెలంగాణలోనే ఇలాంటి కార్యక్రమం చూస్తామని వెల్లడి
Chiranjeevi attends Alay Balay in Hyderabad
గాడ్ పాదర్ విజయంతో మాంచి ఊపుమీదున్న మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన 'అలయ్ బలయ్' కార్యక్రమానికి హాజరయ్యారు. 'అలయ్ బలయ్' కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి హాజరుకావడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. 'అలయ్ బలయ్' కార్యక్రమంలో పాల్గొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, ఇన్నాళ్లకు సాధ్యమైందని తెలిపారు. అది కూడా ఓ పెద్ద హిట్ వచ్చిన తర్వాత 'అలయ్ బలయ్' కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకమని తెలిపారు. 

గత 17 ఏళ్లుగా దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తుండడం గర్వించాల్సిన విషయం అని చిరంజీవి అన్నారు. తెలంగాణలో దసరా సందర్భంగా జమ్మి ఆకులు ఇచ్చి పెద్దలకు నమస్కరించడం, తోటివారిని ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం సంప్రదాయంగా వస్తోందని, ఇది ఒక్క తెలంగాణలో మాత్రమే చూస్తామని అన్నారు. 

ఇక చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ, పరిశ్రమలో అందరు కలిసున్నా, ఫ్యాన్స్ విషయానికొచ్చేసరికి పరస్పర ద్వేషం కొనసాగుతోందని, కథానాయకుల మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తే అందరిలోనూ మార్పును చూడొచ్చని చిరంజీవి అభిప్రాయపడ్డారు. 'అలయ్ బలయ్' తరహాలోనే ఇండస్ట్రీలోనూ ఓ సమావేశం ఏర్పాటు చేశానని, పార్టీ కూడా ఇచ్చానని వెల్లడించారు.