మీరు తిట్టినంత ఘోరంగా నన్ను మా ఆవిడ కూడా తిట్టదు: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను ఉద్దేశించి కేజ్రీవాల్ వ్యాఖ్యలు

06-10-2022 Thu 19:04
  • సీఎం కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ
  • ప్రేమలేఖగా అభివర్ణించిన కేజ్రీవాల్
  • ఇటీవల కాలంలో కేజ్రీవాల్, సక్సేనా మధ్య మాటల యుద్ధం
Kejriwal comments on Delhi LG VK Saxena
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తనకు రాసిన లేఖ పట్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గత ఆరు నెలల కాలంలో లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి తనకు అనేక 'ప్రేమలేఖలు' అందాయని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పటిదాకా అన్ని ప్రేమలేఖలు తన భార్య కూడా రాసి ఉండదని చమత్కరించారు. 

"ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు నన్ను ప్రతి రోజూ తిడుతుంటారు. ఆయన తిట్టినంత ఘోరంగా మా ఆవిడ కూడా నన్ను ఎప్పుడూ తిట్టలేదు" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. "మీరు కొంచెం శాంతించాలి. మీ సూపర్ బాస్ కు చెప్పండి... ఆయనను కూడా కొంచెం శాంతించమనండి" అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు. 

అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ వద్దకు సీఎం కేజ్రీవాల్ రాకపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీఎంఓకు లేఖ రాశారు. గత మేలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా సక్సేనా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్ కు ఆయనకు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.