సిద్ధ‌రామ‌య్య చేయి ప‌ట్టుకుని ప‌రుగెత్తించిన రాహుల్ గాంధీ.. స‌ర‌దా వీడియో ఇదిగో

06-10-2022 Thu 18:43
  • క‌ర్ణాట‌క‌లోని మాండ్యా జిల్లాలో సాగుతున్న రాహుల్ యాత్ర‌
  • సిద్ధ‌రామ‌య్య‌ను ముందుకు పిలిచి ఆయ‌న‌తో క‌లిసి ప‌రుగెత్తిన రాహుల్‌
  • క‌ర్ణాట‌క మాజీ సీఎంను ఉత్సాహ‌ప‌ర‌చిన జోడో యాత్రికులు
rahul gandhi runs with siddaramaiah in jodo yatra
భార‌త్ జోడో యాత్ర పేరిట‌ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో గురువారం ఓ స‌ర‌దా స‌న్నివేశం చోటుచేసుకుంది. రాహుల్ యాత్ర ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోని మాండ్యా జిల్లాలో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ క‌ర్ణాట‌క శాఖ‌కు చెందిన కీల‌క నేత‌లంతా రాహుల్‌తో క‌లిసి యాత్ర‌లో పాల్గొంటున్నారు. పార్టీ సీనియ‌ర్ నేత‌, క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య కూడా రాహుల్‌తో క‌లిసి యాత్ర సాగిస్తున్నారు.

ఈ క్ర‌మంలో గురువారం త‌న వెనకాల న‌డుస్తున్న సిద్ధ‌రామ‌య్య‌ను ముందుకు పిలిచిన రాహుల్ గాంధీ.. ఆయ‌న చేతిని ప‌ట్టుకుని స‌ర‌దాగా అలా ప‌రుగు తీశారు. త‌న చేతిని ప‌ట్టుకుని రాహుల్ ప‌రుగు పెట్ట‌డంతో ఆయ‌నతో క‌లిసి ఆప‌సోపాలు ప‌డుతూ సిద్ధ‌రామ‌య్య కూడా ప‌రుగు పెట్టారు. 75 ఏళ్ల వ‌య‌సులో సిద్ధ‌రామ‌య్య అలా ప‌రుగు తీస్తుండటంతో ఆయ‌న‌ను మ‌రింత ఉత్సాహ‌ప‌రిచేలా ఈల‌లు కేక‌లు వేస్తూ యాత్ర‌కు హాజ‌రైన వారు ఆయ‌న వెంట ప‌రుగెత్తారు.