VH: బీజేపీతో డూప్ ఫైట్ చేయడానికే బీఆర్ఎస్ పార్టీ స్థాపించారు: వీహెచ్

  • బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కేసీఆర్
  • బీజేపీకి ఇది బీ టీమ్ అంటూ వీహెచ్ వ్యాఖ్యలు
  • బీజేపీకి లబ్ది చేకూర్చడానికేనని వెల్లడి
  • కేసీఆర్ ను ఎవరూ నమ్మరని వ్యాఖ్యలు
  • దేశంలో ఏ పార్టీ కేసీఆర్ కు సహకరించదని స్పష్టీకరణ
 VH comments on BRS and KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. బీజేపీపై పోరాడడానికే బీఆర్ఎస్ ఏర్పాటు చేశానని కేసీఆర్ చెబుతున్న మాటల్లో వాస్తవంలేదని అన్నారు. బీజేపీతో డూప్ ఫైట్ చేయడానికే కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని విమర్శించారు. 

వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఒక బీ టీమ్ వంటిదని అభివర్ణించారు. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో సంపాదించిన సొమ్మును ఇక దేశంలో ఖర్చు చేస్తారని విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్మును దేశంలో పంచుతున్నారని మండిపడ్డారు. 

కేసీఆర్ ను దేశం పిలుస్తోందంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని వీహెచ్ కొట్టిపారేశారు. రాష్ట్రంలో ఏమీ చేయని కేసీఆర్, దేశంలో ఏదో చేస్తారంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. అసలు విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసని, అయితే వారు కేసీఆర్ మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని చెప్పి సోనియా గాంధీని మోసం చేసిన చరిత్ర కేసీఆర్ సొంతమని వీహెచ్ వెల్లడించారు. కేసీఆర్ ఇప్పుడు దేశంలోని రైతుల గురించి మాట్లాడతున్నాడని, రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు. దేశంలో ఏ పార్టీ కూడా కేసీఆర్ కు సహకరిస్తుందని తాను అనుకోవడంలేదని అన్నారు.

More Telugu News