విమానం కొన్న‌వాళ్లు ఇద్ద‌రే... ఆ ఇద్ద‌రూ పొత్తు పెట్టుకుంటారేమో: బండి సంజ‌య్‌

06-10-2022 Thu 16:31
  • విమానం కొన్న ఇద్ద‌రు కేఏ పాల్‌, కేసీఆర్‌లేనన్న బండి సంజ‌య్‌
  • ఎవ‌రు జాతీయ పార్టీ పెట్టినా స్వాగ‌తిస్తామ‌ని వెల్ల‌డి
  • కేసీఆర్ ఏ అజెండాతో జాతీయ పార్టీ పెట్టార‌ని ప్ర‌శ్న‌
  • కుమారుడిని సీఎం చేయ‌డ‌మే కేసీఆర్ ఆలోచ‌నని ఆరోప‌ణ‌
telangana bjp chief bandi sanjay satires on cm kcr
తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పార్టీ పేరును భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)గా మార్చ‌డంతో పాటుగా జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లుగా బుధ‌వారం చేసిన ప్ర‌క‌ట‌న‌పై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్ గురువారం స్పందించారు. జాతీయ రాజ‌కీయాల్లోకి ఎవ‌రు వ‌చ్చినా తాము స్వాగ‌తిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే భార‌త్ రాష్ట్ర స‌మితి అంటే అర్థ‌మేమిటో కేసీఆర్ చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన‌ప్పుడు నాడు పార్టీలో ఉన్న వాళ్ల‌లో ప్ర‌స్తుతం ఎంత‌మంది ఇంకా అదే పార్టీలో కొన‌సాగుతున్నారో చెప్పాల‌న్నారు. 

ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌పై బండి సంజ‌య్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజ‌కీయాల్లో విమానం కొన్న వాళ్లు ఇద్ద‌రే ఇద్ద‌రు ఉన్నార‌న్న సంజ‌య్‌... వారిలో ఒక‌రు కేఏ పాల్ కాగా, మ‌రొక‌రు కేసీఆర్ అని తెలిపారు. భ‌విష్య‌త్తులో విమానం కొన్న వీరిద్ద‌రూ పొత్తు పెట్టుకుంటారేమోన‌ని కూడా సంజ‌య్ వ్యాఖ్యానించారు. బుధ‌వారం నాటి టీఆర్ఎస్‌ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌లో ఏ ఒక్క‌రు కూడా సంతోషంగా కూర్చోలేద‌ని ఆయ‌న అన్నారు. త‌న కుమారుడు కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌న్న‌దే కేసీఆర్ ఆలోచ‌న అన్నారు. కేసీఆర్ ఏ అజెండాతో జాతీయ పార్టీ పెట్టార‌ని సంజ‌య్‌ ప్ర‌శ్నించారు.