హైదరాబాద్​ లో భారీ వర్షం.. చాలా ప్రాంతాల్లో జలమయమైన రోడ్లు!

06-10-2022 Thu 16:27
  • కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ తో జనం ఇబ్బందులు
  • లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో అవస్థలు
  • అటు వికారాబాద్ జిల్లాల్లోనూ అతి భారీగా కురుస్తున్న వానలు
Heavy rain at Hyderabad and near places
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే వాన మొదలైనా.. మధ్యాహ్నానికి మొత్తం నగరవ్యాప్తంగా విస్తరించింది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, అంబర్ పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ విస్తారంగా వాన పడింది. గురువారం సాయంత్రానికి కూడా పలు ప్రాంతాల్లో వాన కొనసాగుతూనే ఉంది.

ప్రజలకు అవస్థలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చేరాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేసింది. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. వాన కొనసాగుతూనే ఉండటంతో ట్రాఫిక్ కు తీవ్రంగా ఇబ్బంది ఎదురైంది. వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకుని ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్కడా విస్తారంగా వానలు పడుతున్నాయి.

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు మూడు రోజులు కూడా వానలు కొనసాగుతాయని వెల్లడించింది. 

వికారాబాద్ అతిభారీ వర్షాలు
హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లా పరిధిలో గురువారం అతి భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరపి లేని వానతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పరిగి - మహబూబ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల కూడా రహదారులపై నీళ్లు ప్రవహిస్తుండటంతో పోలీసులు ఆయా గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు.