Congress: గున్న ఏనుగు గాయంపై క‌ర్ణాట‌క సీఎంకు లేఖ రాసిన రాహుల్ గాంధీ

  • క‌ర్ణాట‌కలో కొన‌సాగుతున్న భార‌త్ జోడో యాత్ర‌
  • ద‌స‌రా సంద‌ర్భంగా యాత్ర‌కు 2 రోజులు విరామం ఇచ్చిన రాహుల్‌
  • త‌ల్లి సోనియాతో క‌లిసి నాగ‌ర్‌హోల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ను సంద‌ర్శించిన వైనం
  • పార్క్‌లో గాయంతో క‌నిపించిన గున్న ఏనుగును చూసిన రాహుల్‌
  • గున్న ఏనుగుకు త‌క్ష‌ణ వైద్య సాయం అందించాల‌ని క‌ర్ణాట‌క సీఎంకు లేఖ‌
rahul gandhi writes a letter tokarnataka cm over injured baby elephant

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ త‌న భార‌త్ జోడో యాత్ర‌కు రెండు రోజుల పాటు విరామం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. యాత్ర ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న‌ను చూసేందుకు వ‌చ్చిన త‌న త‌ల్లి సోనియా గాంధీతో క‌లిసి బుధ‌వారం ఆయ‌న క‌ర్ణాట‌క‌లోని నాగ‌ర్‌హోల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ను సంద‌ర్శించారు. పార్క్‌లో ఓ గున్న ఏనుగు గాయంతో బాధ‌ప‌డుతున్న వైనాన్ని చూసి ఆయ‌న తీవ్రంగా స్పందించారు. 
గాయంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న గున్న ఏనుగు త‌న త‌ల్లి ఏనుగు వ‌ద్ద సాంత్వ‌న పొందుతున్న దృశ్యాన్ని ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న గున్న ఏనుగు గాయంపై క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మైకు లేఖ రాశారు. గాయం కార‌ణంగా గున్న ఏనుగు చ‌నిపోయే స్థితికి చేరింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ వైద్య సాయం అందిస్తే ఆ గున్న ఏనుగు బ‌తికే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టి త‌న విజ్ఞ‌ప్తి మేర‌కు సీఎం త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని, గున్న ఏనుగుకు త‌క్ష‌ణ వైద్య సాయం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాహుల్ త‌న లేఖ‌లో కోరారు..

More Telugu News