ఇక నెంబ‌ర్ ప్లేట్ల ఆధారంగానే టోల్ వ‌సూలు... కొత్త నిబంధ‌నలు ఇవే

05-10-2022 Wed 16:22
  • త్వ‌ర‌లోనే టోల్ గేట్ల‌ను ఎత్తివేయాల‌ని కేంద్రం నిర్ణ‌యం
  • వాహ‌న ప‌రిమాణం, అది ప్ర‌యాణించిన దూరం ఆధారంగా టోల్ లెక్కింపు
  • వాహ‌న‌దారుల బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా టోల్ డెబిట్ అయ్యేలా ఏర్పాటు
  • దేశ‌వ్యాప్తంగా ఏకరూప నెంబ‌ర్ ప్లేట్ల‌కు నిర్ధీత గ‌డువు విధించే అవ‌కాశం
union government will introduced new tolltax collection soon
వాహ‌నాల టోల్ ట్యాక్స్ వ‌సూళ్ల‌ను పూర్తిగా మార్చివేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. టోల్ వ‌సూళ్ల కోసం ర‌హ‌దారుల‌పై ఏర్పాటు చేసిన టోల్ గేట్ల‌ను త్వ‌ర‌లోనే తొల‌గించాల‌ని కూడా కేంద్రం తీర్మానించింది.  కొత్త త‌ర‌హా నిబంధ‌న‌ల‌తో టోల్‌ను వ‌సూలు చేయాల‌ని ఇదివ‌ర‌కే తీర్మానించిన కేంద్రం... అందుకు సంబంధించిన విధివిధానాల‌ను కూడా దాదాపుగా ఖ‌రారు చేసింది. టోల్ గేట్లు లేకుండానే టోల్ ట్యాక్స్ వ‌సూళ్ల‌తో వాహ‌న‌దారులు ర‌హ‌దారుల‌పై ఇక‌పై ఎక్క‌డా ఆగ‌కుండానే వెళ్లే వెసులుబాటు కూడా అందుబాటులోకి రానుంది.

ప్ర‌స్తుతం ఫాస్టాగ్‌తో టోల్ గేట్ల‌లో ట్యాక్స్‌ను వ‌సూలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫాస్టాగ్ అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌స్తుతం టోల్ గేట్ల వ‌ద్ద భారీ క్యూలు త‌గ్గిపోయాయి. ఇక కొత్త‌గా అందుబాటులోకి రానున్న టోల్ వ‌సూలు విధానంలో వాహ‌నాల నెంబ‌ర్ ప్లేట్ల ఆధారంగా ట్యాక్స్‌ను వసూలు చేస్తారు. ఈ మేర‌కు దేశ‌వ్యాప్తంగా ఏక‌రీతి నెంబ‌ర్ ప్లేట్ల‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెంబ‌ర్ ప్లేట్ల‌కు వాహ‌నదారులు అనుసంధానించే బ్యాంకు ఖాతాల నుంచి టోల్ ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యేలా నిబంధ‌న‌లు మార్చ‌నున్నారు. ఇందుకోసం ఓ నిర్ణీత కాల వ్య‌వ‌ధిని కూడా కేంద్ర రవాణా శాఖ నిర్దేశించ‌నుంది. 

కొత్త విధానంలో వాహ‌నం ప్ర‌యాణించిన దూరాన్ని బ‌ట్టి మాత్ర‌మే కాకుండా వాహ‌న ప‌రిమాణాన్ని బ‌ట్టి కూడా ట్యాక్స్‌ను వ‌సూలు చేయ‌నున్నారు. అంటే వాహ‌న ప‌రిమాణం పెరిగే కొద్దీ ట్యాక్స్ పెరుగుతుంద‌న్న మాట‌. వాహ‌న ప‌రిమాణం, ఆ వాహ‌నం ర‌హ‌దారిపై ప్ర‌యాణించే దూరాన్ని లెక్కించి ట్యాక్స్‌ను వసూలు చేయ‌నున్నారు. అంటే ఇక‌పై కార్లన్నింటికీ ఒకేలా, భారీ వాహ‌నాల‌న్నింటికీ ఒకేలా ట్యాక్స్ ఉండ‌ద‌న్న మాట‌. ఈ కొత్త నిబంధ‌న‌ల‌తో త్వ‌ర‌లోనే కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌నుంది.