మూవీ రివ్యూ: 'గాడ్ ఫాదర్'

05-10-2022 Wed 15:43
  • నేడే విడుదలైన 'గాడ్ ఫాదర్'
  • డిఫరెంట్ లుక్ తో అలరించిన చిరంజీవి 
  • కీలకమైన పాత్రలో మెప్పించిన నయనతార 
  • తనదైన యాక్షన్ మార్క్ చూపించిన సల్మాన్ 
  • సత్యదేవ్ నటనకి మరిన్ని మార్కులు పడ్డట్టే
God Father Movie Review
చిరంజీవి అంటే మాస్ డైలాగులకు ..  మాస్ స్టెప్పులకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకుంటారు. ఇక తెరపై ఆయన హీరోయిన్స్ ను ఆటపట్టించే తీరు మామూలుగా ఉండదు. అలాంటి ఆయన హీరోయిన్ గానీ .. రొమాంటిక్ మాస్ డాన్సులు గాని లేకుండా చేసిన సినిమానే 'గాడ్ ఫాదర్'. కొంతకాలం క్రితం మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్'కి ఇది రీమేక్. మలయాళ ప్రేక్షకులు కథ సహజత్వానికి దగ్గరగా ఉండటాన్ని ఇష్టపడతారు. అందువలన ఆ సినిమా అక్కడ పెద్ద హిట్ అయింది. చిరంజీవి తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన 'గాడ్ ఫాదర్' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందన్నది చూద్దాం.


రాష్ట్ర ముఖ్యమంత్రి పీకేఆర్ (సర్వదమన్ బెనర్జీ) చనిపోతాడు. దాంతో ఆయన స్థానంలో ముఖ్యమంత్రి కావడానికి అప్పటివరకూ హోమ్ మినిస్టర్ గా ఉన్న నారాయణ వర్మ (మురళీ శర్మ) ప్రయత్నిస్తుంటాడు. పీకేఆర్ పెద్ద కూతురు సత్యప్రియ (నయనతార)  భర్త జయదేవ్ (సత్యదేవ్)  తేనె పూసిన కత్తిలాంటివాడు. మావగారి కుర్చీని తాను దక్కించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. భర్తను చాలా మంచివాడని నమ్ముతూ వచ్చిన సత్యప్రియ, అతణ్ణి ముఖ్యమంత్రిగా ప్రకటించాలని చూస్తుంటుంది. అయితే అందుకు బ్రహ్మ (చిరంజీవి) అడ్డుపడతాడేమోనని ఆమె కంగారు పడుతూ ఉంటుంది.

బ్రహ్మ  ఎవరో కాదు .. సత్యప్రియకి సవతి తల్లి కొడుకు. అతని కారణంగానే తన తల్లి చనిపోయిందని భావించిన సత్యప్రియ ద్వేషం పెంచుకుంటుంది. చెల్లి ఆలనా పాలన తానే చూసుకుంటూ వస్తుంది. దుబాయ్ వెళ్లిన బ్రహ్మ అక్కడ మాఫియా సామ్రాజ్యంలో 'గాడ్ ఫాదర్' గా ఎదుగుతాడు. రాజకీయంగా తన చుట్టూ చేరుతున్న శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, తనకి అండగా నిలబడతాడనే ఉద్దేశంతో పీకేఆర్ అతనిని పిలిపిస్తాడు. పీకేఆర్ చనిపోవడంతో వారసుడినంటూ ఆయన ఎక్కడ పోటీకి వస్తాడోనని సత్యప్రియ - జయదేవ్ ఆయనను దూరంగా ఉంచుతారు. 

తన తండ్రి పార్టీకి దూరంగా ఉంటూనే .. ఆయన ఆశయాలను బ్రహ్మ ఎలా నెరవేర్చాడు? తన పట్ల సత్యప్రియకి గల అపోహలను ఎలా తొలగించాడు? భర్త కారణంగా సమస్యల ఊబిలో చిక్కుకున్న ఆమెను ఆయన ఎలా రక్షించాడు? పదవి కోసం ప్రాణాలు తీయడానికి వెనుకాడని జయదేవ్ కి ఆయన ఎలా బుద్ధి చెప్పాడు? అనేదే కథ.

పొలిటికల్ డ్రామాగా .. ఎమోషన్ తో కూడిన యాక్షన్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించాడు. కథపై ఏడాదిపాటు కసరత్తు చేసిన తరువాతనే ఆయన చిరంజీవిని తీసుకుని సెట్స్ పైకి వెళ్లాడు. ఇక తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ కథను తీర్చిదిద్దడంలో సత్యానంద్ పాత్ర కూడా ఉంది. అందువలన ఈ సినిమాలో ఎక్కడా మలయాళ వాసనలు రావు. నేరుగా తెలుగు కథను చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. చిరంజీవి లుక్ మొదలు, ప్రతి విషయంలో మోహన్ రాజా తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు గాడ్ ఫాదర్ స్థాయిని పెంచుతూ వెళ్లిన విధానం బాగుంది.  ఇంటర్వెల్ బ్యాంగ్ లోను  .. క్లైమాక్స్ లోను సల్మాన్ ఉండేలా ప్లాన్ చేసుకున్న తీరు కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. . 

'గాడ్ ఫాదర్' గా చిరంజీవి స్టైల్ కి .. నటనకి వంకబెట్టనవసరం లేదు. అలాగే సత్యప్రియ పాత్రలో ఆ పాత్ర తప్ప నయనతార కనిపించదు. ఇక పదవి కోసం ఎంతకైనా తెగించే జయదేవ్ పాత్రకి సత్యదేవ్ పూర్తి న్యాయం చేశాడు. సముద్రఖని .. మురళీశర్మలకి కూడా ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలే దక్కాయి. ఇక సునీల్ చేసింది చాలా చిన్న పాత్ర. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు చేయవలసిన పాత్ర ఇది. జర్నలిస్టుగా పూరి పాత్ర ఓకే. తెరపై కనిపించేది కాసేపే అయినా సల్మాన్ తన మార్క్ చూపించి వెళ్లాడు. తమన్ ట్యూన్స్ చెప్పుకోదగినవిగా అనిపించవు. యాక్షన్ షాట్స్ పై కట్ చేసిన 'నజభజ జజర' పాటలో సాహిత్యం వినిపించదు. బీట్ ప్రధానంగా 'తార్ మార్' మాత్రమే జోరుగా హుషారుగా కొనసాగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే మాత్రం మంచి మార్కులే ఇవ్వొచ్చు. నీరవ్ షా కెమెరా పనితనం .. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ బాగున్నాయి. 

ఈ సినిమాకి లక్ష్మీ భూపాల్ అందించిన సంభాషణలు బాగున్నాయి. సింపుల్ గా అనిపిస్తూనే మనసు లోతులను తాకేలా ఉన్నాయి. 'మన అవసరం ఎదుటివాడి అవసరంగా మారిస్తే మనం కష్టపడవలసిన పనిలేదు' .. 'నాకు కావలసింది పదవి కాదు .. పద్ధతి' .. 'నా ప్రాణం ఖరీదు ఎంతో తెలిశాక అంత తేలిగ్గా ఎలా వదులుకుంటాను' .. 'క్షమించడానికి మహాత్ముడిని కాను .. ఓర్చుకోవడానికి పరమాత్ముడిని కాను' .. 'బలహీనుడు చెప్పే నిజం కంటే బలవంతుడు చెప్పే అబద్ధానికి బలమెక్కువ' .. ఇలా గుర్తుపెట్టుకోదగిన డైలాగ్స్ చాలానే ఉన్నాయి. ప్రభుదేవ .. శేఖర్ మాస్టర్ కొరియో గ్రఫీ, రామ్ లక్ష్మణ్ .. అనల్ అరసు ఫైట్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయని చెప్పచ్చు. 

ఈ సినిమాలో హీరోయిన్ .. మాస్ డాన్సులు లేకపోయినా, అవి లేవనే ఆలోచన రాదని ప్రమోషన్స్ లో చిరంజీవి చెప్పారు. కథను బట్టి .. చిరంజీవి పాత్రను బట్టి చూసుకుంటే, హీరోయిన్ కీ .. మాస్ డాన్సులకు నిజంగా అవకాశమే లేదు. అందువలన చిరంజీవి చెప్పిన మాటను ఒప్పుకోవలసిందే. ఇక కథ సీరియస్ గా మొదలై అంతకు ఎంత మాత్రం తగ్గకుండా ముగుస్తుంది. ఎక్కడా కామెడీ అనేది కనిపించదు. కామెడీ కాలు పెట్టడానికి కూడా కథలో ఎక్కడా చోటు కనిపించదు. ఐటమ్ సాంగ్ బాగున్నప్పటికీ, మధ్యలో యాక్షన్ సీన్స్ ను జోడించడం వలన కిక్కు మిస్సయిందేమోనని అనిపిస్తుంది. 

సవతి కొడుకు .. తండ్రికి దూరంగా పెరగడం .. గాడ్ ఫాదర్ గా ఎదగడం అనే ట్రాక్ పాతదే. అలాగే మరదలిని డ్రగ్స్ కి బానిసను చేసి, ఆమెను లోబరుచుకోవాలనే బావగా సత్యదేవ్ ట్రాక్ కూడా పాతదే. సవతి తల్లి కూతురి కోసం అన్నగారు రంగంలోకి దిగడం కూడా కొన్ని పాత సినిమాలను గుర్తుకు చేస్తుంది. ఈ అంశాలు 'లూసిఫర్' కంటే ముందునుంచి ఉన్నవే. మరి ఈ సినిమాలో కొత్తగా కనిపించేదేమిటంటే, ఇలాంటి ఒక కథను తన ఇమేజ్ కి భిన్నంగా చిరూ చేయడమే. ఆయన చేసిన ఆ ప్రయోగమే కొత్తగా అనిపిస్తుంది. కథ కొత్తది కాకపోయినా .. కథనం అక్కడక్కడా మందగించినా మెగాస్టార్ మాయాజాలం ప్రేక్షకులను కూర్చోబెడుతుంది. చిరంజీవి మార్క్ రొమాన్స్ .. మాస్ డాన్సులు .. కామెడీ ఉండవని ముందుగానే తెలిసి థియటర్ కి వెళ్లిన ప్రేక్షకులకు ఈ సినిమా నిరాశను కలిగించకపోవచ్చు. కథను పూర్తిస్థాయి రాజకీయాల్లోనే పిండి ఆరేయడం వలన, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి.