కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన కీలక సమావేశంలో కనిపించని కవిత!

05-10-2022 Wed 14:31
  • జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను అధికారికంగా ప్రకటించిన కేసీఆర్
  • సమావేశానికి హాజరైన కుమారస్వామి, టీఆర్ఎస్ కీలక నేతలు
  • సమావేశానికి హాజరు కాని కవిత
K Kavitha not attended the meeting of KCRs new party BRS announcement
దేశ రాజకీయాల్లో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్రను పోషించిన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇకపై జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్రను పోషిస్తుందని ఆయన తెలిపారు. ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. 

ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామితో పాటు తమిళనాడుకు చెందిన నేతలు కూడా హాజరయ్యారు. అయితే, టీఆర్ఎస్ ప్రముఖులందరూ హాజరైన ఈ సమావేశానికి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అత్యంత కీలకమైన ఈ సమావేశానికి కేటీఆర్, హరీశ్ రావు హాజరైనప్పటికీ... అక్కడ కవిత మాత్రం కనిపించలేదు. దీనిపై ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు చేసుకుంటున్నారు. మరోవైపు, ఈ సమావేశానికి కవిత హాజరు కానప్పటికీ... ఆమె ప్రగతి భవన్ లోనే ఉన్నారని చెపుతున్నారు. ఈ అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.