కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్ర‌బాబు స్పంద‌న ఇదే!

05-10-2022 Wed 14:19
  • బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న టీడీపీ అధినేత‌
  • కేసీఆర్ జాతీయ పార్టీపై ఆయ‌న స్పంద‌న కోరిన మీడియా
  • చిరున‌వ్వుతోనే బీఆర్ఎస్‌పై స్పందించిన చంద్ర‌బాబు
chandrababu responds on kcr national party with a smile
తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌)ను జాతీయ పార్టీగా ప్ర‌క‌టించిన ఆ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌... పార్టీ పేరును భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)గా మార్చేసిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ త‌న పార్టీ పేరును మార్చి పార్టీకి జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇప్పించిన వైనంపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. అటు తెలంగాణ‌తో పాటు ఇటు ఏపీలోనూ... దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఈ ప‌రిణామంపై చ‌ర్చ న‌డుస్తోంది. 

ఇలాంటి త‌రుణంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం సతీస‌మేతంగా బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను దర్శించుకున్న చంద్ర‌బాబు అక్క‌డే మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ జాతీయ పార్టీపై మీ స్పంద‌నేమిట‌ని మీడియా ఆయ‌నను ప్ర‌శ్నించింది. ఈ ప్ర‌శ్న‌కు నోరు విప్ప‌ని చంద్ర‌బాబు... మీడియా ప్ర‌తినిధుల‌ను అలా చూస్తూ ఓ న‌వ్వు న‌వ్వేసి వెళ్లిపోయారు. వెర‌సి చిరున‌వ్వుతోనే ఆయ‌న కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించారు.

గ‌తంలో కేసీఆర్ టీడీపీలో కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా... కేసీఆర్ తొలుత మంత్రిగా, ఆ త‌ర్వాత‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌గా ప‌నిచేశారు. అయితే త‌న‌కు స‌ముచిత స్థానం ద‌క్క‌లేద‌న్న భావ‌న‌తో టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కేసీఆర్ ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మాన్ని భుజానికెత్తుకుని టీఆర్ఎస్ పేరిట పార్టీ పెట్టుకున్నారు. కొంత‌కాలం పాటు ఇరువురి మ‌ధ్య మాట‌లు లేక‌పోయినా... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి చంద్ర‌బాబు సీఎం కాగా... తెలంగాణ‌కు కేసీఆర్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య తిరిగి మాట‌లు క‌లిశాయి.