Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా.. 25 మంది దుర్మరణం

  • హరిద్వార్ జిల్లా నుంచి పౌరీ జిల్లాలోని బీర్ఖల్ వెళ్తుండగా ఘటన
  • బ్యారియర్లను దాటుకుని చెట్టును ఢీకొట్టి లోయలో పడిన బస్సు
  • వెలుతురు సరిగా లేకపోవడంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముుఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి
Bus with 50 passengers falls into deep gorge in Uttarakhands Kotdwar 25 dead

పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తాపడిన ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్ జిల్లాలో గత రాత్రి జరిగిందీ ఘటన. రిఖ్నింఖల్ బిరోంఖల్ మోటార్ రోడ్డు సమీపంలోని సిమ్ది గ్రామంలో బస్సు అదుపు తప్పి 500 మీటర్ల లోతైన నాయర్ నది లోయలోకి దూసుకెళ్లింంది. బస్సు హరిద్వార్ జిల్లా నుంచి పౌరి జిల్లాలోని బీర్ఖల్ బ్లాక్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 25 మంది చనిపోయినట్టు చెబుతున్నా అధికారులు మాత్రం సంఖ్యలను కానీ, క్షతగాత్రుల వివరాలు కానీ వెల్లడించలేదు. బాధితులు పౌరిలో ఓ పెళ్లికి వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ధుమ్‌కోట్ పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రానికి చేరుకున్నారు. ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక కార్యక్రమాలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇప్పటి వరకు 9 మందిని రక్షించినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ముగ్గురిని బిరోంఖల్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. అక్కడి నుంచి ఒకరిని కోట్‌ద్వారా ఆసుపత్రికి రెఫర్ చేయగా, మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెప్పారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు ల్యాండ్స్‌డౌన్ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ రావత్ తెలిపారు. వెలుతురు తక్కువగా ఉండడం వల్ల ప్రమాదం గురించిన సరైన సమాచారం లేదని అన్నారు. అయితే, చాలామందే గాయపడి ఉంటారని స్థానికులు చెబుతున్నట్టు పేర్కొన్నారు. అతి వేగంతో వచ్చిన బస్సు బ్యారియర్లను దాటి చెట్టును ఢీకొని లోయలోకి పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఏడాది జూన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో బస్సు 250 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన 25 మంది ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రిధామ్ నుంచి యాత్రికులను తీసుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.   

More Telugu News