Gujarat: మహిళలు గార్భా నృత్యం చేస్తుండగా రాళ్లు రువ్విన ఆకతాయిలు.. ఓ యువకుడిని పట్టుకుని లాఠీతో చితకబాదిన పోలీసులు: వీడియో ఇదిగో!

  • గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఘటన
  • రాళ్లు రువ్విన 150 మంది ఆకతాయిలు
  • 43 మందిపై కేసు నమోదు
  • 10 మంది అరెస్ట్
 Garba event cops thrash suspects by holding them against electric pole

దసరా వేడుకల సందర్భంగా గార్భా నృత్యం చేస్తున్న మహిళలు, చిన్నారులపై రాళ్లు రువ్విన ఆకతాయిని పట్టుకుని పోలీసులు చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని ఖేడా జిల్లా ఉండేలా గ్రామంలో జరిగిందీ ఘటన. మసీదుకు దగ్గర్లో గార్భా నృత్య వేడుకలు నిర్వహిస్తుండడాన్ని వ్యతిరేకించిన ఆకతాయిలు వారిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీసులు సహా ఏడుగురు గాయపడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుల్లో ఒకడిని పట్టుకున్నారు. 

పోలీసుల్లో ఒకరు నిందితుడిని స్తంభానికి ఆనించి అతడి చేతులను గట్టిగా పట్టుకోగా మరో సీఐ అతడిని లాఠీతో చితకబాదాడు. అయితే, పోలీసుల్లో ఎవరూ యూనిఫామ్‌లో లేకపోవడం గమనార్హం. నిందితుడిని చితక్కొట్టిన అనంతరం క్షమాపణలు చెప్పించినట్టు వీడియోను బట్టి తెలుస్తోంది. కాగా, రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి 43 మందిపై కేసులు నమోదు కాగా, వారిలో పదిమందిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News