SP Balasubrahmanyam: ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు వివాదంలో గుంటూరు నగరపాలక కమిషనర్ వివరణ

  • గుంటూరు మదర్ థెరీసా సెంటర్ లో బాలు విగ్రహం ఏర్పాటు
  • తొలగించిన అధికారులు
  • నాజ్ సెంటర్ లో విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చామన్న కమిషనర్
  • కానీ మదర్ థెరీసా సెంటర్ లో ఏర్పాటు చేశారని ఆరోపణ
Guntur commissioner explains why the remove SP Balu statue

గుంటూరులోని మదర్ థెరీసా సెంటర్ లో కళా దర్బార్ సంస్థ ఏర్పాటు చేసిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అధికారులు తొలగించడం వివాదాస్పదమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గుంటూరు నగరపాలక కమిషనర్ చేకూరి కీర్తి వివరణ ఇచ్చారు. 

తాము ఒక ప్రదేశంలో విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇస్తే, సదరు సంస్థ వారు మరో ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేశారని వెల్లడించారు. గతేడాది జూన్ 5న నాజ్ సెంటర్లో విగ్రహ ఏర్పాటుకు నగరపాలక సంస్థ అనుమతి మంజూరు చేసిందని, కానీ మదర్ థెరీసా సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేశారని చేకూరి కీర్తి వివరించారు. 

అనుమతి లేని ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేసినందునే, విగ్రహం తొలగించాల్సి వచ్చిందని, అనుమతి ఇచ్చిన ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని కళా దర్భార్ సంస్థకు స్పష్టం చేశామని తెలిపారు. 

కాగా, తొలగించిన ఎస్పీ బాలు విగ్రహాన్ని ఓ టాయిలెట్ వద్ద ఉంచడం పట్ల కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందిస్తూ ట్వీట్ చేయడం తెలిసిందే.

More Telugu News