బ‌ర్త్ డే నాడు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన రిష‌బ్ పంత్‌

04-10-2022 Tue 21:54 | Sports
  • కేఎల్ రాహుల్ విశ్రాంతి నేప‌థ్యంలో వైస్ కెప్టెన్‌గా రిష‌బ్‌
  • కెప్టెన్ రోహిత్‌తో క‌లిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన వైనం
  • 14 బంతుల్లో 27 ప‌రుగులు చేసిన వికెట్ కీప‌ర్‌
  • జూలు విదిల్చిన‌ట్లుగా క‌నిపించినా వికెట్ చేజార్చుకున్న వైనం
rishab panth scores 27 runs on his birth day
టీమిండియా వికెట్ కీప‌ర్‌... మంగ‌ళ‌వారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రిష‌బ్ పంత్ జ‌న్మ‌దినం నేడు. టీమిండియా స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌కు విశ్రాంతి నేప‌థ్యంలో బ‌ర్త్ డే నాడు జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా అవ‌కాశం ద‌క్కించుకున్న‌రిష‌బ్‌... అందివ‌చ్చిన అవ‌కాశాన్ని మాత్రం అంత‌గా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. ద‌క్షిణాఫ్రికా నిర్దేశించిన 228 ప‌రుగుల భారీ విజ‌య‌ల‌క్ష్య చేధ‌న‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (0)తో క‌లిసి జ‌ట్టు ఇన్నింగ్స్‌ను రిష‌బ్ ప్రారంభించాడు. 

ఆదిలోనే రోహిత్ స‌హా శ్రేయాస్ అయ్య‌ర్ (1) వికెట్లు కోల్పోయి జ‌ట్టు క‌ష్టాల్లో ప‌డ్డ స‌మ‌యంలో జూలు విదిల్చిన‌ట్లుగా క‌నిపించిన రిష‌బ్‌... 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో కేవ‌లం 27 ప‌రుగులు మాత్ర‌మే చేసి అవుట‌య్యాడు. లుంగి ఎంగిడీ బౌలింగ్‌లో ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌కు క్యాచ్ ఇచ్చి రిష‌బ్ వెనుదిరిగాడు. ఓ వైపు సీనియ‌ర్ ప్లేయ‌ర్ దినేశ్ కార్తీక్ (46) ప‌రుగుల‌తో చెల‌రేగుతున్న స‌మ‌యంలో రిష‌బ్ పెద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు.