Narottam Mishra: 'ఆదిపురుష్' పై వివాదం... న్యాయపరమైన చర్యలు తీసుకుంటానంటూ మధ్యప్రదేశ్ హోంమంత్రి హెచ్చరిక

Madhya Pradesh home minister Narottam Mishra slams Adipurush team
  • ఆదిపురుష్ లో వివిధ పాత్రలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్
  • రావణుడికి మిలిటరీ క్రాఫు అంటూ వ్యాఖ్యలు
  • హనుమంతుడు కింగ్ కాంగ్ లా కనిపిస్తున్నాడని సెటైర్లు
  • ఆంజనేయుడ్ని చూపించిన తీరు అభ్యంతరకరమన్న నరోత్తమ్ మిశ్రా
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆదిపురుష్' వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజైంది. అయితే, అందులో రావణ, హనుమాన్ పాత్రలు కనిపించిన తీరుపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది.

రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మిలిటరీ క్రాఫుతో, పొడవైన గడ్డంతో విచిత్రంగా కనిపించడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హనుమంతుడు కూడా ఇంగ్లీషు సినిమాల్లో కింగ్ కాంగ్ లా ఉన్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్రస్థాయిలో స్పందించారు. 

ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడి వేషధారణ అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు. తోలు పట్టీలతో కూడిన దుస్తుల్లో హనుమంతుడి వేషధారణ సరికాదని అన్నారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే ఆదిపురుష్ నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు. 

"పురాణ వ్యక్తులను తేలిగ్గా తీసుకుని తప్పుగా చూపించడం తగదు. హనుమంతుడు తోలు దుస్తుల్లో కనిపించడం ఏంటి? మన పురాణాల్లో హనుమంతుడి రూపం వర్ణన ఎంతో గొప్పగా ఉంటుంది. ఇప్పుడిలా తప్పుగా చూపించడం మన భక్తివిశ్వాసాలపై ఉద్దేశపూర్వకమైన దాడిగానే భావించాల్సి ఉంటుంది. మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేందుకే ఈ సన్నివేశాలకు రూపకల్పన చేసి ఉంటారు" అంటూ నరోత్తమ్ మిశ్రా తీవ్ర విమర్శలు చేశారు. 

ఈ అంశంపై తాను ఆదిపురుష్ నిర్మాతకు లేఖ రాస్తున్నానని తెలిపారు. ఆదిపురుష్ చిత్రంలోని అభ్యంతకర సన్నివేశాలు తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆ లేఖలో స్పష్టం చేస్తానని వెల్లడించారు.
Narottam Mishra
Home Minister
Madhya Pradesh
Adipurush
Hanuman
Prabhas

More Telugu News