Hyderabad: హైదరాబాద్‌లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఉల్లంఘిస్తే జేబులు ఖాళీ!

  • సిగ్నల్ లైన్ వద్ద వైట్‌లైన్‌ను క్రాస్ చేస్తే రూ. 100 జరిమానా
  • ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ. 1000 ఫైన్
  • పాదచారులకు అడ్డంగా వాహనాలు నిలిపితే రూ. 600 జరిమానా
  • నిబంధనలు పాటించడం ద్వారా జరిమానాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
New traffic Rules Enforced From today Onwards in Hyderabadd

హైదరాబాద్ వాసులు వాహనాలతో రోడ్లపైకి వచ్చినప్పుడు ఈ రోజు నుంచి కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే చేతి చమురు వదిలిపోతుంది. నగరంలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. కాబట్టి ఇంతకుముందులా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జేబులు ఖాళీ కావడం ఖాయం. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నూతన నిబంధనలు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సిగ్నల్ లైన్ క్రాస్ చేసినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ నేటి నుంచి సిగ్నల్ వద్ద ఉండే వైట్ లైన్ క్రాస్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ లైన్‌ను క్రాస్ చేసి ముందుకు వస్తే రూ. 100 జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఫ్రీలెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ. 1000, పాదచారులకు అడ్డంగా వాహనాలు నిలిపితే రూ. 600 జరిమానాగా వసూలు చేస్తారు. అలాగే, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులపైనా కఠినంగా వ్యవహరిస్తారు. 

రాంగ్ పార్కింగ్‌లో ఫోర్ వీలర్ పార్కింగ్‌కు రూ. 600 వసూలు చేస్తారు. బైకర్లు హెల్మెట్ లేకుండా ప్రయాణించినా, కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్టు ధరించకున్నా, అతి వేగంతో ప్రయాణించినా, నో పార్కింగ్ జోన్‌లో వాహనాలు నిలిపినా చేతి చమురు వదిలిపోతుంది. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించడం ద్వారా జరిమానాలకు దూరంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

More Telugu News