రాంలీలా మైదానంలో జరిగే రావణ దహనం కార్యక్రమానికి ప్రభాస్ కు ఆహ్వానం!

02-10-2022 Sun 22:49
  • ప్రతి దసరాకు రావణ దహనం
  • ఢిల్లీ రాంలీలా మైదానంలో వేడుకలు
  • కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రభాస్!
Invitation for Prabhas to Ravan Dahan at Delhi Ramleela maidan
ప్రతి ఏటా దసరా సందర్భంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమం జరగడం ఆనవాయితీ. కాగా ఈసారి రావణ దహనం కార్యక్రమానికి టాలీవుడ్ హీరో ప్రభాస్ ను కూడా నిర్వాహకులు ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ కార్యక్రమాన్ని ప్రభాస్ ప్రారంభిస్తారని సమాచారం. 

ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం ఇవాళ ఉత్తరప్రదేశ్ లోని రామజన్మభూమి అయోధ్యలో నిర్వహించారు. ఈ సందర్భంగా 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ, రాంలీలా మైదానంలో జరిగే రావణ దహనం కార్యక్రమానికి తనతో పాటు హీరో ప్రభాస్ కూడా హాజరవుతారని వెల్లడించారు. 

'ఆదిపురుష్' చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రను పోషించిన నేపథ్యంలోనే, రావణ దహనం కార్యక్రమానికి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఈసారి రావణ దహనం కోసం అయోధ్య రామమందిరం రూపంలోని వేదికను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.