హైదరాబాదులో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు

02-10-2022 Sun 22:23
  • నగరంలోని పలు ప్రాంతాల్లో సిట్ అధికారుల సోదాలు
  • ముగ్గురి అరెస్ట్
  • 4 హ్యాండ్ గ్రనేడ్లు, రూ.5 లక్షల నగదు స్వాధీనం
Huge terror plot busted by SIT in Hyderabad
హైదరాబాదులో సిట్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పలు ప్రాంతాల్లో సోదాలు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని జాహెద్ (మూసారాంబాగ్), సమీరుద్దీన్ (సైదాబాద్), హసన్ ఫారూఖీ (మెహదీపట్నం)గా గుర్తించారు. అరెస్టయిన వారి నుంచి 4 హ్యాండ్ గ్రనేడ్లు, కొన్ని మొబైల్ ఫోన్లు, రూ.5.41 లక్షల డబ్బు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు.  

జాహెద్... గతంలో బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో పేలుడు ఘటనతో పాటు పలు ఘటనలకు పాల్పడినట్టు గుర్తించారు. బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయం పేలుడు ఘటనలో నిందితులు అబ్దుల్ మాజిద్, ఫర్హతుల్లా ప్రస్తుతం పాకిస్థాన్ లో తలదాచుకుని ఉండగా, జాహెద్ వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు భావిస్తున్నారు. 

హైదరాబాదులో మరోసారి ఉగ్రదాడికి వీరు కుట్ర పన్నుతున్న విషయం సిట్ పోలీసుల ద్వారా బట్టబయలైంది. ఈ పథకం అమలు కోసం జాహెద్... సమీరుద్దీన్, హసన్ ఫారూఖీలను నియమించుకున్న విషయం కూడా వెల్లడైంది.