టీమిండియా బ్యాటింగ్ చేస్తుంటే మైదానంలోకి వచ్చిన పాము... మ్యాచ్ కు అంతరాయం

02-10-2022 Sun 22:02
  • గువాహటిలో ఘటన
  • పామును గుర్తించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు
  • వెంటనే స్పందించిన మైదానం సిబ్బంది
  • తిరిగి కొనసాగిన ఆట
Snake enters into ground during Team India batting
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గువాహటిలో రెండో టీ20 మ్యాచ్ లో పాము కలకలం చెలరేగింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా మైదానంలోకి పాము వచ్చింది. ఫీల్డింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఈ పామును గుర్తించారు. బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ కు ఆ పామును చూపించారు. అనంతరం, అంపైర్లను అప్రమత్తం చేశారు. 

దీనిపై వెంటనే స్పందించిన మైదానం సిబ్బంది తగిన పరికరాలతో గ్రౌండ్ లోకి వచ్చి పామును చాకచక్యంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికి టీమిండియా 7 ఓవర్లలో 68 పరుగులతో ఆడుతోంది. 

కాగా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసే సమయంలోనూ మ్యాచ్ నిలిచిపోయింది. ఫ్లడ్ లైట్లలో ఒక టవర్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో మైదానంలో తగినంత వెలుగు కనిపించలేదు. కాసేపటి తర్వాత ఆ టవర్ ను పునరుద్ధరించడంతో మ్యాచ్ కొనసాగింది.