క్షీణించిన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం... ఐసీయూకి తరలింపు

02-10-2022 Sun 18:46
  • ఆగస్టు నుంచి ఆసుపత్రిలో చికిత్స
  • నేడు విషమించిన ఆరోగ్యం
  • ఆంకాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స
  • హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్న తనయుడు అఖిలేశ్ యాదవ్
Mulayam Singh Yadav health deteriorates
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకనేత ములాయం సింగ్ యాదవ్ (82) ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దాంతో ఆయనను ఐసీయూకి తరలించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం ఆగస్టు 22వ తేదీ నుంచి గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆంకాలజిస్టులు డాక్టన్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల్ కటారియాల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ములాయం ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ఆయన తనయుడు, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వద్దకు వచ్చారు. గతేడాది జులైలోనూ ములాయం అస్వస్థతతో ఆసుపత్రిపాలయ్యారు. 

కాగా, ములాయం త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ దాస్ మౌర్య తెలిపారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ములాయం ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.