సెప్టెంబరు మాసంలో మారుతి సుజుకి అమ్మకాల రికార్డు

02-10-2022 Sun 18:25
  • గతేడాది సెప్టెంబరుతో పోల్చితే భారీ వృద్ధి
  • 135.10 శాతం అమ్మకాల పెరుగుదల
  • ఈ ఏడాది సెప్టెంబరులో 1.48 లక్షల యూనిట్ల అమ్మకం
  • గతేడాది సెప్టెంబరులో 63 వేల యూనిట్ల విక్రయం
Maruti Suzuki set sales record in September
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సెప్టెంబరు నెలలో అమ్మకాల పరంగా రికార్డు నమోదు చేసింది. సెప్టెంబరులో మారుతి 1,48,380 కార్లు విక్రయించింది. గతేడాది ఇదే నెలలో కేవలం 63,111 కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబరులో 135.10 శాతం అమ్మకాల వృద్ధి సాధించింది. 

గత నెలలో ఆల్టో, ఎస్-ప్రెస్సో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, వాగన్ ఆర్, బాలెనో, సియాజ్ వంటి మోడళ్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. సెప్టెంబరులో ఈ మోడళ్లు 1,01,750 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021 సెప్టెంబరులో ఈ మోడళ్లు 35,827 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 

యుటిలిటీ వెహికిల్స్ శ్రేణిలోనూ మారుతి సుజుకి అమ్మకాలు ఊపందుకున్నాయి. విటారా బ్రెజా, ఎక్స్ఎల్6, ఎర్టిగా, ఈకో మోడళ్లతో పాటు ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన గ్రాండ్ విటారా కూడా సెప్టెంబరులో అధికంగా అమ్ముడైనట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మోడళ్లు సెప్టెంబరులో 45,271 యూనిట్లు అమ్ముడవగా, గతేడాది ఇదే నెలలో 26,303 యూనిట్లు అమ్ముడయ్యాయి.