తెలంగాణ మంత్రి గంగుల వ్యాఖ్యలపై మండిపడిన ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ

02-10-2022 Sun 17:29
  • తెలంగాణ మంత్రులు వర్సెస్ ఏపీ మంత్రులు
  • కొనసాగుతున్న మాటల యుద్ధం
  • తెలంగాణ విషయాల్లో తలదూర్చొద్దన్న మంత్రి గంగుల
  • ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దన్న ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ
AP minister Venugopalakrishna responds on Telangana minister Gangula Kamalakar remarks
గత కొన్నిరోజులుగా టీఆర్ఎస్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఏపీ మంత్రులు బొత్స, అమర్నాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల తమపై వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ నిన్న మండిపడ్డారు. తెలంగాణ విషయాల్లో తలదూర్చితే బాగుండదని, పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టొద్దని వైసీపీ నేతలను హెచ్చరించారు. 

దీనిపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు. రాజకీయాల్లో ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఏపీ ఉద్యోగుల విషయంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపైనే సజ్జల స్పందించారని స్పష్టం చేశారు. మాతో పెట్టుకుంటే ఏమైనా చేస్తాం అన్న వ్యాఖ్యలను మంత్రి గంగుల ఉపసంహరించుకోవాలని వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.