Shashi Tharoor: ఖర్గేని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలో ఏమీ జరగదు: శశిథరూర్

Shashi Tharoos says Kharge can not make change in Congress party
  • అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు
  • మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ మధ్య ప్రధాన పోటీ
  • ప్రచారం ముమ్మరం
  • పార్టీలో మార్పు రావాలంటే తన వల్లే సాధ్యమన్న థరూర్
  • నెహ్రూ-గాంధీ కుటుంబీకులకు ప్రత్యేకస్థానం ఉంటుందని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన అభ్యర్థులు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ప్రచారం ముమ్మరం చేశారు. తాజాగా ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ.... ఇదేమీ యుద్ధం కాదని, తామేమీ శత్రువులం కాదని స్పష్టం చేశారు. ఇవి తమ పార్టీ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు మాత్రమేనని అన్నారు. 

ఖర్గే కాంగ్రెస్ పార్టీలోని టాప్-3 నేతల్లో ఒకరని తెలిపారు. అయితే ఖర్గే వంటి నేతలు పార్టీలో ఎలాంటి మార్పును తీసుకురాలేరని, ఉన్న వ్యవస్థలనే కొనసాగించడం తప్ప వారేమీ కొత్తగా చేయలేరని థరూర్ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్న మార్పు నాతోనే సాధ్యం అంటూ ధీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న అభ్యర్థుల మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇటీవల బ్రిటన్ ప్రధానిని ఎన్నుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ అనుసరించిన విధానం తరహాలో పార్టీలోని సభ్యుల మనోగతాలను తెలుసుకోవాలని శశిథరూర్ సూచించారు. 

సంస్థాగత సిద్ధాంతాలకు తోడు ప్రభావవంతమైన నాయకత్వమే కాంగ్రెస్ పార్టీని సమర్థంగా నడిపించగలదని అభిప్రాయపడ్డారు. నెహ్రూ-గాంధీ కుటుంబీకులకు కాంగ్రెస్ శ్రేణుల హృదయాల్లో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు.
Shashi Tharoor
Mallikarjuna Kharge
Congress
President
Election

More Telugu News