Himachal Pradesh: ప్రకృతి వేసిన పెయింటింగ్​​.. హిమాచల్​ లోని స్పితి లోయ దృశ్యాలను పోస్ట్​ చేసిన నార్వే దౌత్యాధికారి!

  • శీతాకాలంలో మంచు ఏర్పడి, ఎండాకాలంలో కరిగి భిన్నమైన ఆకృతులతో అలరించే స్పితి లోయ
  • మార్స్ మీద ప్రయాణించినట్టుగా ఉందంటూ క్యాప్షన్ పెట్టిన నార్వే దౌత్యాధికారి
  • అచ్చంగా ఏదో పెయింటింగ్ లా ఉందంటూ నెటిజన్ల కామెంట్లు
Norwegian deplomat Erik solheim shares photos of spiti valley

అదో పెద్ద లోయ ప్రాంతం.. వరుసగా కొండలు, మధ్యలో చిన్న లోయ ప్రాంతాలు.. ఎవరో చెక్కినట్టుగా దాదాపు కచ్చితమైన పరిమాణంలో ఎగుడు దిగుడుగా ఉన్న ఆకారాలు.. వాటి మధ్యగా వాహనాలు వెళ్లే దారి. కళ్లు తిప్పుకోలేనంతగా రంగుల కలయికతో అద్భుతమైన పెయింటింగ్ లా కనిపిస్తున్న ప్రాంతమది. ప్రకృతి వేసిన అద్భుతమైన పెయింటింగ్ అన్నట్టుగా ఉన్న ఈ ప్రాంతం ఉన్నది ఎక్కడో కాదు మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోనే.

స్పితి లోయ అందాలు ఇవి..
హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయ ప్రాంతం ఎన్నో ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. శీతాకాలంలో గడ్డకట్టే మంచు, తర్వాత వేసవిలో కరిగి ప్రవహించడం ద్వారా స్పితి లోయ ప్రాంతంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఏర్పడ్డాయి. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఈ ప్రాంతానికి సంబంధించిన ఫొటోలను నార్వేకు చెందిన దౌత్యవేత్త ఎరిక్ సోల్ హేమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. లోయ ప్రాంతంలో రంగులను అంగారకుడి మీద ఉన్న ప్రాంతంతో పోల్చుతూ కామెంట్ చేశారు.

  • ‘‘మార్స్ మీద రైడ్ చేసినట్టుగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయ ఇది. అద్భుతమైన భారతదేశం. హిమాచల్ కు వెళ్లండి” అంటూ ఎరిక్ క్యాప్షన్ పెట్టారు.
  • ఎరిక్ పెట్టిన ఫొటోలకు పెద్ద సంఖ్యలో లైక్ లు వస్తున్నాయి. ‘అచ్చం ఏదో పెయింటింగ్ లా అద్భుతంగా ఉంది..’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ‘వావ్.. మన దేశంలో ఇలాంటి అద్భుతమైన ప్రాంతం ఉందా? చాలా బాగా చిత్రీకరించారు..’ అని మరికొందరు అంటున్నారు. 
  • ‘ఏదో గ్రాఫిక్ సినిమాల్లో చూపించినట్టుగా భలేగా ఉంది’, ‘ఈ ప్రదేశం బాగుంది. జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లి రావాలని అనిపిస్తోంది..’ అంటూ కామెంట్లు వస్తున్నాయి.

More Telugu News