Congress: అందుకే కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నా: ఖ‌ర్గే

  • గాంధీ కుటుంబం పోటీలో లేక‌పోవ‌డంతో, పార్టీ నేత‌ల ఒత్తిడితోనే నామినేష‌న్ వేశాన‌న్న సీనియ‌ర్ నేత‌
  • తాను ఒక‌రికి వ్య‌తిరేకం కాద‌ని.. కాంగ్రెస్ సిద్ధాంతాల కోస‌మే బ‌రిలో ఉన్న‌ట్లు వెల్ల‌డి
  • ఈ నెల 17న ఎన్నిక‌లు.. 19న ఫ‌లితాలు
 Kharge Explains the reason behind his decision to contest the election

కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్ష ఎన్నిక‌ల అభ్యర్థుల్లో ముందు వ‌రుస‌లో ఉన్న ఆ పార్టీ సీనియ‌ర్ నేత మల్లికార్జున్ ఖర్గే కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. అధ్యక్ష పదవికి ఏకాభిప్రాయ అభ్యర్థిని కలిగి ఉండటం చాలా మంచిదని త‌న పోటీదారు, ఎంపీ శశిథరూర్‌తో చెప్పినట్లు తెలిపారు,  అలాగే, పార్టీ సీనియర్ నేతల ఒత్తిడి మేరకే పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేష‌న్ వేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించారు. 

‘‘రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగా లేక‌పోవ‌డంతో  ఎన్నికల్లో పోటీ చేయమని తోటి నాయ‌కులు నన్ను కోరారు. నేను ఒక‌రికి వ్య‌తిరేకంగా పోటీ ప‌డ‌టం లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం పోటీలో నిలిచాను" అని చెప్పారు. ఇక‌, పార్టీలో ఇప్పుడున్న ప‌రిస్థితి, శ‌శిథ‌రూర్ కోరిన‌ మార్పుల గురించి పార్టీ ప్ర‌తినిధులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయిస్తుందన్నారు. అంతేతప్ప విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను ఒక వ్యక్తి తీసుకోర‌ని, స‌మ‌ష్టిగా తీసుకోవాల్సి ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.   

పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాన‌ని ఖ‌ర్గే వెల్ల‌డించారు. ‘‘నేను ఎల్లప్పుడూ నా సిద్ధాంతం, రాజ‌నీతి కోసం పోరాడుతూనే ఉంటాను. నేను ప్రతిపక్ష నాయకుడిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేక ప‌ర్యాయాలు పనిచేశాను. ఇప్పుడు మళ్లీ పోరాడాలనుకుంటున్నాను. అదే రాజ‌నీతి, భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అని వెల్ల‌డించారు. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం కేవ‌లం దళిత నాయకుడిగా పోటీలో లేన‌ని, కాంగ్రెస్ నాయకుడిగా పోటీ చేస్తున్నాను" అని స్ప‌ష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ అధ్య‌క్ష  ఎన్నిక ఈ నెల 17న జ‌రుగుతుంది. 19న ఓట్లు లెక్కించి విజేత‌ను ప్ర‌క‌టిస్తారు.

More Telugu News