Sachin Tendulkar: అద్భుత ఆట‌తో చాంపియన్ గా నిలిచిన స‌చిన్ జ‌ట్టు

Sachin Tendulkar pens heartfelt message after Road Safety World Series win
  • రోడ్ సేఫ్టీ వ‌ర‌ల్డ్ సిరీస్ లో ఇండియా లెజెండ్స్  ట్రోఫీ కైవ‌సం
  • ఫైన‌ల్లో 33 ప‌రుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్ పై ఘ‌న విజ‌యం
  • తోటి ఆటగాళ్లు, అభిమానుల‌దే ఈ విజ‌యం అన్న స‌చిన్
సచిన్ టెండూల్క‌ర్ కెప్టెన్సీలోని ఇండియా లెజెండ్స్ జ‌ట్టు రోడ్ సేఫ్టీ వ‌ర‌ల్డ్ సిరీస్ లో రెండోసారి విజేత‌గా నిచిలింది. శ‌నివారం రాత్రి రాయ్ పూర్ లో జ‌రిగిన ఫైన‌ల్లో ఇండియా లెజెండ్స్ 33 ప‌రుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్ జ‌ట్టుపై ఘ‌న విజయం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 195 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ న‌మ‌న్ ఓఝా (71 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 108) సెంచ‌రీతో స‌త్తా చాటాడు. సచిన్ టెండూల్క‌ర్ (0), సురేశ్ రైనా (4) విఫ‌ల‌య్యారు. విన‌య్ కుమార్ (36) రాణించాడు. శ్రీలంక బౌల‌ర్ల‌లో నువాన్ కుల‌శేఖ‌ర మూడు వికెట్లు, ఇసురు ఉడాన రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన లంక 18.5 ఓవ‌ర్ల‌లో 162 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఇషాన్ జ‌య‌ర‌త్నే (51) ఒక్క‌డే అర్ధ సెంచ‌రీలో స‌త్తాచాటాడు. స‌న‌త్ జ‌య‌సూర్య (5), దిల్షాన్ (11) నిరాశ ప‌రిచారు. ఇండియా లెజెండ్స్ విన‌య్ కుమార్ మూడు, అభిమ‌న్యు మిథున్ 2 వికెట్ల‌తో రాణించారు. న‌మ‌న్ ఓఝాకు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ల‌భించింది. దిల్షాన్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ పుర‌స్కారం ల‌భించింది. 

 ట్రోఫీ గెలిచిన త‌ర్వాత సచిన్ ట్విట్ట‌ర్ లో స్పందించాడు. "అప్పటికి, ఇప్ప‌టికి, ఎప్ప‌టికీ ఇండియానే. అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన మాజ‌ట్టు రోడ్ సేఫ్టీ వ‌ర‌ల్డ్ సిరీస్ లో మ‌రోసారి విజేత‌గా నిలిచింది. న‌మ‌న్ ఓఝా బ్యాటింగ్ అద్భుతం. ఈ విజ‌యం మా జ‌ట్టు స‌భ్యులు, అభిమానుల‌ది "అని స‌చిన్ ట్వీట్ చేశాడు.
Sachin Tendulkar
team
win
Road Safety World Series win
message

More Telugu News