Noida TwinTowers: అర్ధరాత్రి పూణె బ్రిడ్జ్ కూల్చివేత.. 6 సెకన్లలోనే నేలమట్టం: వీడియో ఇదిగో!

  • చాందినీ చౌక్‌లో ఉన్న పాత బ్రిడ్జిని కూల్చివేసిన అధికారులు
  • కూల్చేసిన ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం
  • అర్ధరాత్రి దాటిన తర్వాత సురక్షితంగా కూల్చేసిన ఎడిఫిస్ సంస్థ
After Noida Twin Towers now Pune bridge demolished post midnight

దేశంలోనే అత్యంత ఎతైన ట్విన్ టవర్లుగా ఖ్యాతికెక్కిన నోయిడా జంట టవర్లు ఆగస్టు 28న నేలమట్టమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారులు వాటిని కూల్చివేశారు. ఎడిఫిస్ ఇంజినీరింగ్ సంస్థ శక్తమంతమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి వాటిని సురక్షితంగా కూల్చివేసింది. ఇప్పుడదే సంస్థ పూణెలో ఓ పాత వంతెనను కూల్చివేసింది. రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఈ బ్రిడ్జిని గత అర్ధరాత్రి దాటిన తర్వాత సురక్షితంగా కూల్చివేసినట్టు కలెక్టర్ రాజేశ్ దేశ్‌ముఖ్ తెలిపారు. 

నియంత్రిత పేలుడు ద్వారా బ్రిడ్జిని నేలమట్టం చేశారు. ట్విన్ టవర్లను కూల్చినప్పుడు ఉపయోగించిన సాంకేతికతనే ఇక్కడా ఉపయోగించారు. ‘చార్జింగ్’ విధానంలో బ్రిడ్జిపై పేలుడు పదార్థాలను అమర్చారు. ఆపై వాటిని పేల్చడంతో పెద్ద శబ్దంతో బ్రిడ్జి కుప్పకూలింది. 100 మీటర్లకుపైగా ఎత్తున్న ట్విన్ టవర్లను కూల్చివేసేందుకు 9 సెకన్ల సమయం పట్టగా, పూణె బ్రిడ్జి కూల్చివేతకు 6 సెకన్ల సమయం మాత్రమే పట్టింది. బ్రిడ్జిని కూల్చివేసిన ఈ ప్రదేశంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. బ్రిడ్జి కూల్చివేతలో 60 మంది నిపుణలైన వ్యక్తులు పాల్గొన్నట్టు ఎడిఫిస్ ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది.

More Telugu News