బుమ్రా గాయంపై కొనసాగుతున్న అనిశ్చితి... స్పందించిన ద్రావిడ్

01-10-2022 Sat 21:47
  • వీపు నొప్పితో బాధపడుతున్న బుమ్రా
  • వీపు కింది భాగంలో చిన్న పగులు
  • దక్షిణాఫ్రికాతో సిరీస్ కు దూరమైన బుమ్రా
  • టీ20 వరల్డ్ కప్ కు కూడా దూరమంటూ కథనాలు
Rahul Dravid opines on Bumrah availability
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వీపునొప్పితో బాధపడుతుండగా, అతడు టీ20 వరల్డ్ కప్ లో ఆడేది, లేనిదీ ఇప్పుడే చెప్పలేమని ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. బుమ్రా వైద్య నివేదికలపై మరింత లోతుగా వెళ్లదలుచుకోలేదని, అతడు అందుబాటులో ఉండే విషయంపై అధికారిక ప్రకటన కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. 

బుమ్రా వీపు దిగువ భాగంలో ఒత్తిడి కారణంగా స్వల్ప పగులు ఉన్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. అయితే, ఆ గాయానికి బుమ్రా ఎంత కాలం విశ్రాంతి తీసుకోనున్నాడన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. టీ20 వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ కు బుమ్రా లేకపోవడంతో పెద్ద లోటు. అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్నా బుమ్రాను ఈ టోర్నీలో ఆడించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బుమ్రా ఇంకా టీ20 వరల్డ్ కప్ కు దూరం కాలేదని అన్నారు. 

ఈ నేపథ్యంలో, టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ, ఇప్పటివరకైతే దక్షిణాఫ్రికాతో సిరీస్ నుంచి బుమ్రా పూర్తిగా తప్పుకున్నాడని, అయితే రానున్న రోజుల్లో ఏంజరగనుందో వేచిచూడాలని పేర్కొన్నారు. సాధారణంగా వీపు గాయాలకు ఆర్నెల్ల విశ్రాంతి అవసరమవుతుందని నిపుణులు చెబుతుండగా, ద్రావిడ్ మాత్రం బుమ్రా విషయంలో ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. బుమ్రా విషయంలో అధికారిక ప్రకటన కోసం వేచిచూస్తున్నామని, అది జట్టుకు మేలు కలిగేలా ఉండాలని కోరుకుంటున్నామని వివరించారు.