జాతీయ క్రీడల్లో 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజి

01-10-2022 Sat 17:22
  • గుజరాత్ లో 36వ జాతీయ క్రీడలు
  • ఇవాళ 100 మీటర్ల రేసు ఫైనల్స్
  • 11.51 సెకన్లతో పసిడి గెలిచిన జ్యోతి
  • అభినందించిన ఏపీ క్రీడల మంత్రి రోజా
AP athlete Jyothi Yarraji wins 100m gold in National Games
గుజరాత్ లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజి 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. మహిళల 100 మీటర్ల రేసు ఫైనల్లో జ్యోతి 11.51 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ప్రథమస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో తమిళనాడుకు చెందిన అర్చన సుశీంద్రన్ (11.55 సెకన్లు), మహారాష్ట్రకు చెందిన డయాండ్రా (11.62 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. 

ఇక పురుషుల 100మీ పరుగులో అసోంకు చెందిన అమ్లాన్ బోర్గోహైన్ 10.38 సెకన్లతో రేసు పూర్తి చేసి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన ఏలాకియ దాసన్ 10.44 సెకన్లతో రజతం దక్కించుకున్నాడు. 

కాగా, మహిళల 100మీ స్ప్రింట్ లో గోల్డ్ మెడల్ చేజిక్కించుకున్న జ్యోతి యర్రాజిని ఏపీ క్రీడల మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, శాప్ ఎండీ ఎన్.ప్రభాకర రెడ్డి అభినందించారు.