నాడు బ‌స కోసం, నేడు ప‌రామ‌ర్శ కోసం!... కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంటికి సీఎం కేసీఆర్!

01-10-2022 Sat 16:58
  • శ‌నివారం వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేసీఆర్‌
  • కెప్టెన్ లక్ష్మీకాంత‌రావు ఇంటికి వెళ్లిన సీఎం
  • అనారోగ్యం బారిన ప‌డ్డ పార్టీ సీనియ‌ర్ నేత‌కు ప‌రామ‌ర్శ‌
cm kcr visits captain lakshmikantha rao in warangal
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినా... ఎన్ని కార్య‌క్రమాలు ఉన్నా.. పార్టీ సీనియర్ నేత‌ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంటికి వెళ్ల‌కుండా తిరిగి రారు. గ‌తంలో చాలా సార్లు వ‌రంగ‌ల్ వెళ్లిన కేసీఆర్‌... విశ్రాంతి తీసుకోవాల‌నుకున్నా, రాత్రికి న‌గ‌రంలోనే బ‌స చేయాల‌నుకున్నా... నేరుగా కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంటికే వెళ‌తారు. ఇటీవ‌లే వ‌ర‌ద ప్రాంతాల ప‌రిశీల‌న కోసం వ‌రంగ‌ల్ వెళ్లిన కేసీఆర్‌... రెండు రోజుల పాటు ల‌క్ష్మీకాంత‌రావు ఇంటిలోనే బ‌స చేశారు.

తాజాగా శ‌నివారం వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేసీఆర్‌.. మ‌ధ్యాహ్నం కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంటికి వెళ్లారు. అయితే ఈ ద‌ఫా విశ్రాంతికో, బ‌స చేసేందుకో కేసీఆర్ ఆయ‌న ఇంటికి వెళ్ల‌లేదు. ఇటీవ‌లే అనారోగ్యానికి గురైన ల‌క్ష్మీకాంత‌రావు త‌న ఇంటిలోనే కోలుకుంటున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న కేసీఆర్ ఆయ‌న ఇంటికి వెళ్లి ల‌క్ష్మీకాంత‌రావును ప‌రామ‌ర్శించారు. ల‌క్ష్మీకాంత‌రావు ఆరోగ్యంపై ఆరా తీశారు. ల‌క్ష్మీకాంత‌రావు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కేసీఆర్ ఆకాంక్షించారు.