కోహ్లీ కోసం పాకిస్థాన్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పడానికి ఇదొక్కటి చాలు!

01-10-2022 Sat 16:45
  • ఇంత వరకు పాకిస్థాన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని కోహ్లీ
  • సచిన్, ధోనీ తర్వాత పాక్ లో అంత ఫాలోయింగ్ ఉన్న ఆటగాడు విరాట్
  • రిటైర్ అయ్యేలోగా ఒక్క మ్యాచ్ అయినా ఆడు అన్న అభిమాని
Virat Kohli please play in Pakistan PAK fans poster goes viral
ప్రస్తుత ప్రపంచ క్రికెట్ దిగ్గజాలలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కరు. క్రికెట్ ఆడే అన్ని దేశాలపై కోహ్లీ అద్భుతమైన ఆటతీరును కనపరిచి పలు రికార్డులను సొంత చేసుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరపున అన్ని దేశాల్లో 102 టెస్టులు, 262 వన్డేలు, 108 టీ20లు ఆడిన కోహ్లీ... పాకిస్థాన్ గడ్డపై మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2006లో టీమిండియా చివరి సారిగా పాకిస్థాన్ లో ఆడింది. అప్పుడు టీమ్ లో కోహ్లీ లేడు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో... పాకిస్థాన్ లో టీమిండియా అడుగు పెట్టలేదు. 

మరోవైపు నిన్న పాకిస్థాన్ లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో పాక్ - ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఒక పాక్ అభిమాని కోహ్లీని ఉద్దేశిస్తూ ప్రదర్శించిన పోస్టర్ అందరినీ ఆకర్షించింది. క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'కోహ్లీ నీవు రిటైర్ అయ్యే లోగా ఒక్కసారైనా పాకిస్థాన్ లో ఆడు' అని సదరు అభిమాని కోరాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత పాకిస్థాన్ లో ఈ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నది ధోనీ, కోహ్లీనే.