చింతకాయల విజయ్ ఇంట్లో చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురిచేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించడం దారుణం: చంద్రబాబు

01-10-2022 Sat 16:19
  • చింతకాయల విజయ్ నివాసంలో నోటీసులు ఇచ్చిన సీఐడీ
  • తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
  • పోలీసులు దోపిడీ దొంగల్లా చొరబడ్డారని ఆగ్రహం
  • జగన్ నీచమైన స్థితికి దిగజారాడని విమర్శలు
  • దమ్ముంటే ప్రజాస్వామ్య రీతిలో బదులివ్వాలని డిమాండ్
Chandrababu reacts to CID Police issued notices to Chintakayala Vijay
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు సైబర్ క్రైమ్ విభాగంలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 

మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు, టీడీపీ యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి పోలీసులు దోపిడీదొంగల్లా చొరబడడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. విజయ్ ఇంట్లో చిన్నపిల్లలను, పనివాళ్లను భయభ్రాంతులకు గురిచేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని పేర్కొన్నారు. ఐదేళ్ల వయసున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడని చంద్రబాబు విమర్శించారు. 

నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన సీఐడీ పోలీసులు డ్రైవర్ పై దాడి చేయడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ రెడ్డి కేసులు, విచారణల పేరుతో ప్రతిపక్ష నేతలపైకి పోలీసులను రౌడీల్లా ఉసిగొల్పుతున్నాడని మండిపడ్డారు. 

జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీ నేత అయ్యన్నపాత్రుడు కుటుంబంపై మొదటి నుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడిచేశారని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్టు తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు మరేమీ చెయ్యడంలేదని విమర్శించారు. 

ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఐడీ విభాగాన్ని అడ్డంపెట్టుకుని వేధింపులతో పాలన సాగించడం సిగ్గుచేటని చంద్రబాబు పేర్కొన్నారు.