సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు స్వల్ప ఊరట

01-10-2022 Sat 16:13
  • ఇందు థర్మల్ కంపెనీ దివాళా తీసిందనే ప్రకటనపై రఘురాజు పిటిషన్
  • సీబీఐ విచారణపై స్టే ఎత్తివేసిన హైకోర్టు
  • తాము తీర్పును వెలువరించేంత వరకు విచారణను ఆపేయాలన్న సుప్రీంకోర్టు
Raghu Rama Krishna Raju gets relief in Supreme Court
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇందు భారత్ థర్మల్ కంపెనీపై నమోదైన కేసులో విచారణను సీబీఐ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే... ఇందు థర్మల్ కంపెనీ దివాళా తీసిందంటూ గతంలో వెలువడిన ప్రకటనపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దివాళా కంపెనీగా ప్రకటించడానికి అనుసరించాల్సిన పద్ధతులను అనుసరించలేదని కోర్టుకు ఆయన తెలిపారు. 

ఈ నేపథ్యంలో రఘురామపై సీబీఐ కేసు విచారణపై అప్పటి హైకోర్టు సీజేగా ఉన్న హిమా కోహ్లీ ధర్మాసనం స్టే విధించింది. అయితే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ సీజే అయిన తర్వాత స్టేను తొలగించారు. దీంతో, రఘురాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రఘురాజు పిటిషన్ ను జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. తాము తుది తీర్పును వెలువరించేంత వరకు కేసు విచారణను ఆపివేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.