మిషన్ భగీరథకు జల్ జీవన్ మిషన్ అవార్డు ప్రకటించలేదు: కేంద్ర జ‌ల శక్తి మంత్రిత్వ శాఖ‌

01-10-2022 Sat 14:41
  • తెలంగాణ‌కు జ‌ల్ జీవ‌న్ మిష‌న్ అవార్లు వ‌చ్చిన‌ట్లుగా వార్త‌లు
  • ఈ వార్త‌ల‌ను ఖండించిన కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌
  • ఈ అవార్డు కోసం తెలంగాణ‌ను అంచ‌నాలోకే తీసుకోలేద‌ని వెల్ల‌డి
  • మిష‌న్ భ‌గీర‌థ నీటి నాణ్య‌త జ‌ల్ జీవ‌న్ మిష‌న్ నిబంధ‌న‌లకు లోబ‌డి లేద‌ని వివ‌ర‌ణ‌
Ministry of Jal Shakti ruled out jal jeevan mission award to telangana
రాష్ట్రంలోని అన్ని గృహాల‌కు ర‌క్షిత మంచి నీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మిష‌న్ భ‌గీర‌థ‌కు కేంద్రం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ పుర‌స్కారం ఇచ్చిన‌ట్లు రెండు రోజుల క్రితం వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై తాజాగా శ‌నివారం కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ స్పందించింది. తెలంగాణ ప‌థ‌కం మిష‌న్ భ‌గీర‌థ‌కు జ‌ల్ జీవ‌న్ మిష‌న్ అవార్డు ద‌క్కింద‌న‌డం అబ‌ద్ధ‌మ‌ని ఆ శాఖ తెలిపింది. ఈ అవార్డు కోసం మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని అస‌లు అంచ‌నాలోకే తీసుకోలేద‌ని కూడా ఆ శాఖ వెల్ల‌డించింది. 

తెలంగాణ చెబుతున్న‌ట్లుగా రాష్ట్రంలోని వంద శాతం ఇళ్ల‌కు న‌ల్లా క‌నెక్ష‌న్లు ఉన్న‌ట్లు ఇప్ప‌టిదాకా తాము ధృవీక‌రించనే లేద‌ని కూడా కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ తెలిపింది. ఈ విష‌యాన్ని కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్ర‌మే నివేదించింద‌ని తెలిపింది. జ‌ల్ జీవ‌న్ మిష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌మ ప‌రిధిలోని అన్ని ఇళ్ల‌కు న‌ల్లా క‌నెక్ష‌న్లు ఉన్నాయ‌ని రాష్ట్రంలోని అన్ని పంచాయ‌తీలు తీర్మానం చేయాల్సి ఉంద‌ని తెలిపింది. ఆ దిశ‌గా తెలంగాణ‌లోని గ్రామాల తీర్మానాలు ఇప్ప‌టిదాకా త‌మ‌కు చేర‌నే లేద‌ని కూడా ఆ శాఖ వెల్ల‌డించింది. 

గ్రామీణ గృహాల‌కు నీటి స‌ర‌ఫ‌రా విభాగంలో మాత్ర‌మే తెలంగాణ అవార్డుకు ఎంపికైంద‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ తెలిపింది. ఫంక్ష‌నాలిటీ అసెస్‌మెంట్‌లో డేటా ప్రకారం 49 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాల‌కు శాంపిల్స్ ప‌రీక్షించ‌గా... 8 శాతం నివాసాలు ప్ర‌తి రోజు 55 లీట‌ర్ల త‌ల‌స‌రి నీటి కంటే త‌క్కువ తాగునీటిని పొందుతున్నాయ‌ని ఆ శాఖ వెల్ల‌డించింది. అదే స‌మ‌యంలో మొత్తం న‌మూనాల్లో 5 శాతం నివాసాల్లో నీటి నాణ్య‌త జ‌ల్ జీవ‌న్ మిష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం లేద‌ని కూడా తేలింద‌ని ఆ శాఖ తెలిపింది.