TDP: టీడీపీ నేత చింత‌కాయ‌ల విజ‌య్‌కి ఏపీ సీఐడీ నోటీసులు... ఈ నెల 6న విచార‌ణ‌కు రావాలంటూ ఆదేశం

  • హైద‌రాబాద్‌లోని బంజారా హిల్స్ ట్రెండ్ సెట్‌లో విజ‌య్ ఇల్లు
  • ఇంటిలో విజ‌య్ లేకపోవ‌డంతో ఆయ‌న పిల్ల‌ల‌ను ప్ర‌శ్నించిన పోలీసులు
  • ప‌ని మ‌నిషికి నోటీసులు అందజేసిన ఏపీ సీఐడీ
  • విజ‌య్ ఇంటిలో పోలీసులు దురుసుగా వ్య‌వ‌హ‌రించారంటూ లోకేశ్ ఫైర్‌
ap cid notices to tdp leader vijay chintakayala

టీడీపీ ఏపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి చింత‌కాయల అయ్య‌న్న‌పాత్రుడు కుమారుడు చింత‌కాయ‌ల విజ‌య్‌కు చెందిన హైద‌రాబాద్ ఇంటికి శ‌నివారం ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. బంజారా హిల్స్‌లోని ట్రెండ్ సెట్‌లో ఉన్న విజ‌య్ ఇంటికి వెళ్లిన పోలీసులు... ఆ సమయంలో విజయ్ ఇంటిలో లేకపోవడంతో ఆయన పిల్ల‌ల‌ను ప్ర‌శ్నించారు. అనంత‌రం విజ‌య్‌ ఇంటి పనిమనిషికి 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు అందజేశారు. ఈ నెల 6న మంగళగిరిలోని తమ కార్యాలయంలో సైబర్ క్రైమ్ విభాగంలో విచారణకు హాజరు కావాలంటూ సదరు నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. విజ‌య్ ఇంటికి వెళ్లిన పోలీసులు దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌ని టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజ‌య్‌ని పోలీసులు అక్ర‌మంగా అరెస్ట్ చేసేందుకు య‌త్నించార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌పై హైకోర్టు ఎన్ని సార్లు మంద‌లించినా జ‌గ‌న్ స‌ర్కారుకు బుద్ధి రావ‌ట్లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. విజ‌య్ ఇంటిలో ప‌నిచేసే వారిపై బెదిరింపుల‌కు దిగిన పోలీసుల తీరును ఆయ‌న ఖండించారు. ఏపీలో పోలీసు వ్య‌వ‌స్థ‌ను జ‌గ‌న్ రాజ‌కీయ క‌క్ష‌సాధింపుల కోసం వినియోగిస్తున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

More Telugu News