బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరం కాలేదు: గంగూలీ

30-09-2022 Fri 21:45
  • వీపునొప్పితో బాధపడుతున్న బుమ్రా
  • టీమిండియా నుంచి బుమ్రా ఔట్ అంటూ కథనాలు
  • టీ20 వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉందన్న గంగూలీ 
Ganguly opines on Bumrah issue
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వీపునొప్పితో టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడంటూ కథనాలు రావడం తెలిసిందే. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. 

బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరం కాలేదని స్పష్టం చేశారు. వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉన్నందున, టోర్నీలో బుమ్రా ఆడే అవకాశాలను ఇప్పుడే కొట్టిపారేయలేమని అన్నారు. బుమ్రా అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. 

వీపునొప్పితో బాధపడుతున్న బుమ్రాను సెలెక్టర్లు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ కు స్థానం కల్పించారు. బుమ్రా వీపు భాగంలో ఓ ఎముకలో స్వల్ప పగులు ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే బుమ్రాకు 6 నెలల విశ్రాంతి అవసరమంటూ నిన్న వార్తలు వచ్చాయి. బుమ్రా వంటి సిసలైన ఫాస్ట్ బౌలర్ లేకపోవడం టీ20 వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ లో టీమిండియా అవకాశాలపై ప్రభావం చూపుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

అయితే గంగూలీ తాజా వ్యాఖ్యలతో బుమ్రా టోర్నీకి అందుబాటులో ఉండొచ్చన్న ఆశలు కలిగిస్తున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16నే ప్రారంభం కానున్నా, టీమిండియా తన తొలి మ్యాచ్ ను అక్టోబరు 23న పాకిస్థాన్ తో ఆడనుంది. ఈ లోపు బుమ్రా కోలుకోవచ్చంటూ దాదా సంకేతాలు ఇవ్వడం అభిమానుల్లో ఉత్సాహం కలిగిస్తోంది.