Moto GP: చరిత్రలో మొట్టమొదటిసారిగా మోటో గ్రాండ్ ప్రిక్స్ రేసుకు ఆతిథ్యమివ్వనున్న భారత్

  • 2023లో భారత్ లో మోటో జీపీ బైక్ రేసింగ్
  • నోయిడాలోని బుద్ధ రేసింగ్ సర్క్యూట్ లో ఈవెంట్
  • చారిత్రక ఘట్టమన్న క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్
India first time in history hosts Moto Grand Prix international bike racing event

చరిత్రలో తొలిసారిగా భారత్ అంతర్జాతీయ బైక్ రేసింగ్ ఈవెంట్ మోటో గ్రాండ్ ప్రిక్స్ కు ఆతిథ్యమివ్వనుంది. గ్రేటర్ నోయిడాలోని బుద్ధా ఇంటర్నేషనల్ రేసింగ్ సర్క్యూట్ మోటో గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ కు వేదికగా నిలవనుంది. వచ్చే ఏడాది ఈ పోటీలు జరగనున్నాయి. 

దీనిపై భారత క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. 75 వసంతాల స్వతంత్ర భారతావనికి ఇది చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. మోటో గ్రాండ్ ప్రిక్స్ వాణిజ్య హక్కుల సొంతదారు డోర్నా సంస్థ సీఈవో కార్మెలో ఎజ్పెలెటా స్పందిస్తూ, భారత్ లోనూ తమకు భారీగా అభిమానులు ఉన్నారని, వారికి బైక్ రేసింగ్ మజాను అందిస్తామని తెలిపారు. 

అంతేకాకుండా, మోటార్ సైకిల్ ఇండస్ట్రీకి భారత్ కీలక విపణిగా కొనసాగుతోందని, ఇప్పుడు మోటా గ్రాండ్ ప్రిక్స్ రాకతో ఆ విస్తృతి మరింత పెరుగుతుందని వివరించారు. బుద్ధ ఇంటర్నేషనల్ రేసింగ్ సర్క్యూట్ లో గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ నిర్వహించి అభిమానులను అలరించేందుకు ఎప్పుడెప్పుడా అని తహతహలాడుతున్నామని అన్నారు. 

కాగా, నోయిడాలోని బుద్ధ రేసింగ్ సర్క్యూట్ గతంలో ఫార్ములా వన్ కార్ల రేసింగ్ కు వేదికగా నిలిచింది. ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ పేరిట 2011 నుంచి 2013 వరకు ఇక్కడ ఫార్ములా వన్ రేసింగ్ ఈవెంట్లు జరిగాయి. అయితే, ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ ను ఫార్ములా వన్ నిర్వాహకులు షెడ్యూల్ నుంచి తొలగించారు. దాంతో బుద్ధ రేసింగ్ సర్క్యూట్ ఫార్ములా వన్ రేసింగ్ ఆతిథ్యానికి దూరమైంది. మళ్లీ ఇన్నాళ్ల మోటో జీపీ రూపంలో అంతర్జాతీయ ఈవెంట్ కు వేదికగా నిలవనుంది.

More Telugu News