విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు: అక్కినేని నాగార్జున‌

30-09-2022 Fri 17:01
  • రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌నే లేద‌న్న నాగార్జున‌
  • ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి ఇలాగే ప్ర‌చారం చేస్తున్నారంటూ అస‌హనం
  • త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరో
nagarjuna akkineni comments on his political entry
రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న శుక్ర‌వారం కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌నే త‌న‌కు లేద‌న్న నాగార్జున‌... విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. అంతేకాకుండా ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తి సారి ఇలాగే ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆయ‌న ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో నాగార్జునకు స‌న్నిహిత సంబంధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున నాగార్జున విజ‌య‌వాడ లోక్ స‌భ స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతారంటూ కొన్ని రోజులుగా ప్ర‌చారం సాగుతోంది. 2014, 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌లో వైసీపీ ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే. అయితే 2024లో ఎలాగైనా విజ‌య‌వాడ ఎంపీ సీటును గెలుచుకోవాల‌న్న దిశ‌గా సాగుతున్న జ‌గ‌న్‌... విజ‌య‌వాడ నుంచి పోటీ చేయాల‌ని నాగార్జున‌కు ఆఫ‌ర్ ఇచ్చార‌ని కూడా వార్త‌లు వినిపించాయి.