Chandrababu: టీడీపీ హయాంలో జాతీయ క్రీడలను ఘనంగా నిర్వహించాం: చంద్రబాబు

Chandrababu says they had organized national games in a grand style
  • దేశంలో 36వ జాతీయ క్రీడలు షురూ
  • నిన్న అహ్మదాబాద్ లో ప్రారంభించిన ప్రధాని మోదీ
  • 2002లో ఉమ్మడి ఏపీలో జాతీయ క్రీడలు
  • మస్కట్ గా ఒంగోలు గిత్త 'వీర'ను పెట్టామన్న బాబు 
ప్రధాని నరేంద్ర మోదీ నిన్న గుజరాత్ లో 36వ జాతీయ క్రీడలను ప్రారంభించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 36వ జాతీయ క్రీడలు ప్రారంభమైన సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. 

2002లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలను ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు. నాడు హైదరాబాద్ తో పాటు విశాఖను కూడా క్రీడావేదికగా చేశామని వివరించారు. ఒంగోలు గిత్తను 'వీర' పేరుతో జాతీయ క్రీడల మస్కట్ గా పెట్టామని తెలిపారు. ఈ జాతీయ క్రీడల ద్వారా దేశం దృష్టిని ఆకర్షించామని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా దేశానికే తలమానికంగా ఉండేలా హైదరాబాద్ లో పలు స్టేడియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. "నాటి జాతీయ క్రీడల నిర్వహణతో ప్రజల్లో క్రీడాభిలాషను కలిగించి, అనేకమంది క్రీడలను తమ జీవిత లక్ష్యంగా ఎంచుకునే వాతావరణం కల్పించాం అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
National Games
AP
TDP
India

More Telugu News